06-12-2024 01:15:17 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): 6 అబద్ధా లు, 66 మోసాల పేరిట ఇటీవల చార్జిషీట్ విడుదల చేసిన బీజేపీ నాయకులు.. అదే అంశాన్ని హైలెట్ చేస్తూ బహిరంగ సభకు సిద్ధమయ్యారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలపై సరూర్‌నగర్ స్టేడియం మైదానం (ఎల్బీనగర్) లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించనుండగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, ఎంపీలు డీకే అరుణ, కే లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మండలిలో బీజేపీ పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.
సరూర్‌నగర్ సభ ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై పోరుకు బీజేపీ నేతలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏడాది పాలన ఉత్సవాల పేరిట ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కారుపై సరూర్‌నగర్ వేదికగా తూర్పార బట్టనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు పూర్తిగా వివరిస్తామని వారు చెబుతున్నారు.