25-11-2025 05:11:15 PM
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు..
లక్షెట్టిపేట టౌన్ (విజయక్రాంతి): రాబోయే సర్పంచ్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ రావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హలులో లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల కార్యకర్తలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజ్యంగా బద్ధంగా అమలు కావాల్సిన రిజర్వేషన్లను అమలు చేయకుండా బీసీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. జిల్లాలో మొత్తం 306 సర్పంచ్ స్థానాలు ఉంటే బీసీలకు కేవలం 23 స్థానాలు అంటే కేవలం 7.5 శాతం మాత్రమే కేటాయించడం బీసీలను అవమానించడమేనన్నారు.
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అందరు ఏకమై తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని ఎన్నికలు ఎప్పడు నిర్వహించిన బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్తె సత్తన్న, నరేష్ జైన్, ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పబ్బతినేని కమలాకర్ రావు, ఆకుల అశోక్ వర్ధన్, గుండా ప్రభాకర్, గోపతి రాజయ్య, బందెల రవి గౌడ్, గడ్డం స్వామి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.