calender_icon.png 25 November, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

25-11-2025 06:47:38 PM

హనుమకొండలో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా 'మహా రైతు దీక్ష'

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను, వరంగల్ రైతు డిక్లరేషన్‌ను విస్మరించిందని నిరసిస్తూ, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హనుమకొండ, బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ వద్ద భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఆధ్వర్యంలో మహా రైతు దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ దీక్షా కార్యక్రమం హనుమకొండ బిజెపి జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్య హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అన్నదాతలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. ఇప్పటికీ రుణమాఫీ కాని అర్హులైన రైతులందరికీ వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చెల్లించాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా, ఎకరాకు రూ. 15,000 చొప్పున రైతు భరోసా డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేసి, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 'వరంగల్ రైతు డిక్లరేషన్'ను తక్షణమే అమలు చేయాలని, రాష్ట్రంలో 'ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన' (PMFBY)ను వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ డబ్బులను వెంటనే  చెల్లించాలని, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. వరద నష్టపోయిన కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందరికీ అందలేదని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే, రైతుల పక్షాన బిజెపి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డా. రాజేశ్వర్ రావు, వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే మార్తనేని ధర్మారావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయకులు రావు పద్మ , డా. కాళి ప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, కార్పొరేటర్ చాడ స్వాతి శ్రీనివాస్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, ముల్లాడి తిరుపతి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, దొంతి దేవేందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు, కృష్ణవేణి నాయక్, తులసి కళ్యాణి, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, జయంతి లాల్, కక్కెర్ల అనిల్, బైరి శ్రావణ్ ఇతర నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.