25-11-2025 06:19:23 PM
గుండాల (విజయక్రాంతి): వాలీబాల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంస పత్రాన్ని అందుకున్నాడు మోడల్ స్కూల్ విద్యార్థి కొర్న సాత్విక్. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి క్రీడల్లో అండర్-19 వాలీబాల్ విభాగంలో గుండాల ఆదర్శ పాఠశాలలో చదువుతు, క్రీడల్లో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించాడు. అతని ఆట తీరును గుర్తించిన క్రీడా నిర్వాహకులు జాతీయ స్థాయి టోర్నమెంట్ కి ఎంపిక చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగాపూర్ లో జరిగిన జాతీయస్థాయి బాలుర వాలీబాల్ క్రీడల్లో పాల్గొని ప్రశంసపత్రం అందుకున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో విద్యార్థి సాత్విక్, వ్యాయామ ఉపాధ్యాయులు పి. మహేష్ లను పాఠశాల ప్రిన్సిపాల్ జి. రాము, ఉపాధ్యాయులు అభినందించారు.