calender_icon.png 25 November, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా రైతులకు సబ్సిడీ యంత్రాల పంపిణీ

25-11-2025 06:21:34 PM

సిద్దిపేట కలెక్టరేట్: 25 సిద్దిపేట ఐడిఓసి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26లో 171 మంది మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలను పంపిణీ చేశారు. జిల్లాకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి 7 లక్షల 80 వేల నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ఈ నిధులతో సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, మానకొండూర్, జనగాం నియోజకవర్గాల మహిళా రైతులకు యంత్రాలు అందజేస్తున్నట్లు వివరించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వినియోగం ప్రతి సంవత్సరం పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా రైతులు యాంత్రీకరణను మరింతగా ఉపయోగించి ఉత్పాదకతను పెంపొందించుకోవాలని సూచించారు. రబీ సీజన్‌కు అవసరమైన పరికరాలను సబ్సిడీపై అందించడం ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఆయిల్ పామ్ సాగుదారులు కోరుతున్న బ్రష్ కట్టర్ వంటి యంత్రాలను త్వరితగతిన అందించే చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడి పంట సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డీడీ స్వరూపరాణి, సహాయ సంచాలకులు, ఇతర అధికారులు, లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు.