కేంద్రంలో బీజేపీ హాట్రిక్ ఖాయం

27-04-2024 01:50:59 AM

ఇంటర్వ్యూ :

l దేశ భద్రత కోసం కాషాయానికే ప్రజల మొగ్గు

l కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో ఓటర్లు లేరు

l గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశా..

l ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తామంటున్నారు

l విజయక్రాంతితో జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్

సంగారెడ్డి, ఏప్రిల్ 26 (విజయ క్రాంతి): కేంద్రంలో భారతీయ జనతా పార్టీ హాట్రిక్ కొడుతుందని జహీరాబాద్ పార్లమెంట్ ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎంపీగా గెలిచానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పదేళ్లు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేసినట్లు చెప్పారు. విజయక్రాంతితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని, గ్రామాల్లోకి వెళ్లినప్పుడు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తామని చెబుతున్నట్లు తెలిపారు. 

జహీరాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలుపొందారు. నియోజకవర్గంలో ఏం పనులు చేశారు?

జహీరాబాద్ ఎంపీగా గెలుపొంది సంగారెడ్డి నుంచి నాందేడ్ 161వ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.3,160 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేశాం. నారాయణఖేడ్‌ొోబీదర్ 161(బీ) జాతీయ రహదారి నిర్మాణం చేసేందుకు రూ.512.98 కోట్లు మంజూరు చేసేందుకు కృషి చేశా. 765(డీ) జాతీయ రహదారి నర్సాపూర్ నుంచి మెదక్, బాన్సువాడ, రుద్రూర్ వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.426.52 కోట్లు మంజూరు చేసేందుకు కృషి చేశాను. పనులు కొనసాగుతున్నాయి. జోగిపేట పట్టణంలో నాలుగు లైన్లు రోడ్డు నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరు చేయించాను. కేంద్ర రహదారుల నిధులు (సీఆర్‌ఎఫ్) కింద 157.2 కిలోమీటర్లుకు రూ.164 కోట్లు కేటాయించేలా కృషి చేశాను. ప్రధాన మంత్రి సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకంలో 139.18 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి రూ.78.14 కోట్లు మంజురు చేసి పనులు పూర్తి చేశాం.

పార్లమెంట్ పరిధిలో రైల్వే ప్రాజెక్టు చేసేందుకు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేశారా?

2016 క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రాంలో బీదర్ కొత్త రైలు మార్గం కోసం రూ.2000 కోట్లు,  జహీరాబాద్  మార్గానికి రూ.1,400 కోట్లు మంజూరు చేయించాను. జహీరాబాద్, కామారెడ్డి రైల్వే స్టేషన్‌లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేశాను. తాండూర్‌ెేజహీరాబాద్‌కు సిమెంట్ క్లస్టర్‌గా కొత్త రైలు మార్గం ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.1,350 కోట్లు మంజూరు చేయించాను. అమృత్ భారత్ పథకంలో భాగంగా కామారెడ్డి రైల్వేస్టేషన్‌కు రూ.39.90 కోట్లు, జహీరాబాద్‌కు రూ.24.35 కోట్లు మంజూరు చేయించడంతో పనులు జరుగుతున్నాయి. 

ప్ర: గత పార్లమెంట్ ఎన్నికలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశారా?

ఇక్కడ రెండు సార్లు గెలిచాను. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేశాను. విద్య, వైద్య, ఆరోగ్యం కోసం కృషి చేశాను. నియోజకవర్గంలో ఉన్న యువతకు ఉపాధి కలిపించేందుకు ఝరాసంగం, న్యాల్‌కల్ మండలంలో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటుకు కృషి చేశాను. జహీరాబాద్ పార్లమెంట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేయడంతో గ్రామాలకు వెళ్లినప్పుడు స్వచ్ఛందంగా వచ్చి అశీర్వదిస్తున్నారు. 

బీజేపీ మతతత్వ పార్టీ అని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇద్దరు దళితులను రాష్ట్రపతులుగా చేసింది. ఎక్కడా మతం, కులం చూడలేదు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలో మోదీ, అమిత్ షా సారథ్యంలో 400కుపైగా ఎంపీ సీట్లు గెలుపొందడం ఖాయం. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మతతత్వ పార్టీగా కొందరు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించి పదవులు ఇచ్చింది. 500 ఏండ్లుగా నిర్మాణం కాని రామమందిరాన్ని మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. 

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే వెంటనే రైతుల సమస్యలను పరిష్కరిస్తారా?

నన్ను గెలిపిస్తే వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తా. జహీరాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి మంజీరా ప్రవహిస్తుంది. మంజీరా నీటిని వ్యవసాయానికి అందించేలా చూస్తా. ప్రతి గ్రామానికి మంజీరా తాగునీరు సరఫరా చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కోసం ప్రయత్నం చేస్తాను. 

కేంద్రంలో మూడోసారి బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందా?

దేశంలో ప్రజలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ హ్యాట్రిక్ సాధించి అధికారంలోకి వస్తుంది. దేశ భద్రత కోసం బీజేపీ పార్టీని గెలిపించేందుకు ప్రజలు మందుకు వస్తున్నారు. జహీరాబాద్ లోకసభ పరిధిలో ఎక్కడ చూసినా ప్రజలు వచ్చి ఓట్లు వేస్తామని చెపుతున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రజలకు శాసనసభ ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.