రైతు కేంద్రంగా రాజకీయాలు!

27-04-2024 01:48:44 AM

l కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్, బీజేపీ విమర్శలు

l రూ.2 లక్షల రుణమాఫీపై సవాళ్లు.. ప్రతి సవాళ్లు 

l రాజీనామాలకు సై అంటున్న నేతలు

l ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తోన్న నాయకులు

l రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ ఆరోపణ

l అన్నదాతల వివరాలు ఇస్తే పరిహారం చెల్లిస్తామంటున్న సర్కారు

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): పార్లమెంట ఎన్నికల్లో పట్టు సాధిం చేందుకు ప్రధాన పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహా ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఏదైనా సమస్య దొరికితే రాజకీయంగా వాడుకుంటున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రైతుల చుట్టూనే రాజకీయా లు నడుస్తున్నాయి. పార్టీలు, అభ్యర్థులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే రైతుల సమస్యలను ప్రతి ఎన్నికల్లో వాడుకోవడం సహజమే అయినా.. ప్రస్తుత ఎన్నికల్లో అన్నదాతలనే కేంద్ర బిందువుగా చేసుకుంటున్నారు. వాళ్ల ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన హామీలను బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు గుర్తు చేస్తున్నాయి. వాటిని ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్, సాగునీటి సమస్య, రైతులు ఆత్మహత్యల వంటి అంశాలను ప్రస్తావిస్తూ అధికార కాంగ్రెస్‌ను కార్నర్ చేస్తున్నారు. చివరకు పదవులకు రాజీనామాలు చేయడాని సిద్ధమనే స్థాయికి వెళ్లారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి సభలో ప్రస్తావిస్తున్నారు. 

కీలక నేతల రాజీనామాల సవాళ్లు.. 

విపక్షాల విమర్శలపై సీఎం రేవంత్‌రెడ్డి దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్‌లో వరి ధాన్యానికి రూ.500 బోనస్‌తో పాటు రైతు భరోసాను కూడా ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తామని సభల్లో చెబుతున్నారు. సభలు నిర్వహించిన ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలపై ప్రమాణం చేస్తూ రుణమాఫీపై హామీ ఇస్తున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే బీఆర్‌ఎస్ పార్టీని మూసేస్తారా? అని రేవంత్ సవాల్ విసిరారు. అయితే సీఎం ఒట్లు వేయడంపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. రుణమాఫీని పూర్తిగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ ఉపఎన్నికల్లోనూ పోటీ చేయనంటూ శాసన సభాపతికి రాజీనామా లేఖ రాశారు. అయితే, ఈ లేఖ స్పీకర్ ఫార్మాట్‌లో లేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా గుర్తు చేస్తున్నారు. 

ఆరోపణలు.. కౌంటర్లు..

ఇక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ కూడా రైతు సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరీంనగర్‌లో ఒక రోజు దీక్ష చేశారు. దీనికి బదులుగా రాష్ట్ర విభజన హామీలను ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో ఒక రోజు దీక్ష చేపట్టారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హమీలను అమలు చేయడంలో విఫలమైందని, రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు కూడా తెలంగాణకు నిధులు తీసుకురాలేకపోయారని విమర్శలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 209 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్ విమర్శలపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. ఆత్మహత్యలకు పాల్పడినవారి వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని, వారిని ఆదుకునే బాధ్యత సర్కార్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆత్మహత్య చేసుకున్నవారి వివరాలను ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ అందజేయగా.. ఎన్నికల కోడ్ ఎత్తేశాక వారిని గుర్తించి ఆదుకుంటామని రేవంత్ తెలిపారు. 

రైతు చూపు ఎటు వైపో..? 

పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రె స్ పార్టీ 14 ఎంపీ సీట్లను హస్తగతం చేసుకోవాలనే పట్టుదలతో ముందుకెళ్లుతోం ది. అందుకు తగిన వ్యూహాలను రచిస్తోం ది. రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు లేదా మూడు బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సెగ్మెంట్‌లో సభలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు కూడా బస్సుయాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలోని ప్రతి సెగ్మెంట్‌ను చుట్టేస్తున్నా రు. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ను దాటుతామని బీజే పీ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రం లో తిష్ట వేసి లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతు న్నారు. ఈ పార్టీలన్నీ ప్రధానంగా రైతు అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. రైతు మాత్రం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా నెలకొన్నది.