24-11-2025 12:00:00 AM
-అనూహ్యంగా దక్కిన పదవి
-ముందున్నవి అసలు సవాళ్లు
-కాంగ్రెస్‌లో అసంతృప్తి
-హరి వర్ధన్‌రెడ్డి పనితీరు బాగా లేనందునే దక్కని మరో అవకాశం
మేడ్చల్, నవంబర్ 23(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తోటకూర వజ్రేస్ యాదవ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. వజ్రేష్ యాదవ్‌కు డిసిసి పదవి వస్తుందని ఎవరు ఊహించలేదు. ఓసి కోటాలో హరి వర్ధన్ రెడ్డి, బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కు పదవి వరిస్తుందని భావించగా అనూహ్యంగా వజ్రేస్ యాదవ్ కు డిసిసి పీఠం దక్కింది.
కార్యకర్తల అభిప్రాయ సేకరణలో కూడా ఈయన పేరు ఎక్కువగా చెప్పలేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినందున ఆ కోణంలో పదవి దక్కి ఉండవచ్చని భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ కూడా అలాగే దక్కిందని అంటున్నారు.
డిసిసి అధ్యక్ష పదవి ప్రకటించిన తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో లోలోపల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున డిసిసి అధ్యక్ష పదవికి ప్రాముఖ్యం పెరిగింది. పార్టీ పదవికి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అవసరమైతే ఒక మెట్టు దిగాల్సి ఉంటుంది. నిరంతరం పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పంతాలు, పట్టింపులకు పోకుండా అందరిని కలుపుకొని వెళ్లాలి. క్యాడర్‌లో ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహం నింపాలి.
క్యాడర్ కు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వాలి. అవసరమైతే ఖర్చుకు కూడా వెనుకాడకూడదు. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జిగా వజ్రెష్ యాదవ్ కార్యకర్తలను మెప్పించలేకపోయారు. కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో వజ్రేస్ యాదవ్ వ్యూహాత్మకంగా వెళితే ఎమ్మెల్యేగా గెలిచేవారే.
బి ఆర్ ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీద నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. మంత్రిగా తన వ్యాపారం విస్తరణ పైనే దృష్టి పెట్టారని, నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం పట్టించుకోలేదనే భావన ప్రజల్లో ఉంది. దీనిని వజ్రేష్ యాదవ్ క్యాచ్ చేసుకోలేదు. ముఖ్య నాయకులను సమన్వయం చేసుకోకుండా ఒంటెత్తు పోకడలకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.
డీసీసీ అధ్యక్షుడి ముందు సవాళ్లు
డిసిసి అధ్యక్షుడికి మునుముందు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. జిల్లాలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉండవు. మున్సిపల్, జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఉంటాయి. వీటిలో టికెట్ల పంపిణీ నుంచి అభ్యర్థుల గెలుపు వరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేగాక జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. అన్నిచోట్ల పార్టీ పటిష్టతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని నియోజకవర్గాల నాయకులను సమన్వయం చేసుకోవలసి ఉంటుంది.
హరి వర్ధన్ రెడ్డికి రెండోసారి దక్కని అవకాశం
మరోసారి డిసిసి అధ్యక్ష పదవి కోసం హరివర్ధన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో ఉన్న పరిచయాలతో మరోసారి తనకు అవకాశం వస్తుందని ధీమాతో ఉన్నారు. కానీ ఆయనకు మరోసారి అవకాశం దక్కలేదు. ఒకసారి వచ్చిన అవకాశాన్ని హరివర్ధన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేకపోయారు. పార్టీని పటిష్టం చేయడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చర్యలు తీసుకోలేకపోయారు.
ఒక్క పెద్ద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున పార్టీని పటిష్టం చేయడానికి అవకాశం ఉండి కూడా పట్టనట్లు వ్యవహరించినట్లు ఆ పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. రెండు నెలల క్రితం అంటే డిసిసి అధ్యక్ష ఎన్నికకు ముందు మేడ్చల్ లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని, ఐదు ప్రచార రథాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను ఆహ్వానించారు.
ఇలాంటి కార్యక్రమం ముందుగానే ఏర్పాటు చేస్తే బాగుండేదని, అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండోసారి అధ్యక్ష పదవి ఇవ్వవద్దని ఏఐసీసీ నిబంధన పెట్టింది. కానీ హరివర్ధన్ రెడ్డి మొదటిసారి పూర్తి కాలం పనిచేయలేదు. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్ కు అవకాశం వచ్చింది.
ఆంజనేయులు గౌడ్, హరి వర్ధన్ రెడ్డి ఒకేసారి ఒకే తరహాలో 2023 ఎన్నికల సమయంలో నియమితులయ్యారు. ప్రస్తుతం ఆంజనేయులు గౌడు కు రెండోసారి అవకాశం వచ్చింది. కానీ హరి వర్ధన్ రెడ్డికి రాలేదు. హరి వర్ధన్ రెడ్డి పనితీరు బాగుంటే రెండోసారి అవకాశం ఇచ్చేవారు. రాష్ట్రంలో మరోచోట ఓసి కి డీసిసి పదవి తగ్గించేవారు. హరి వర్ధన్ రెడ్డి, శ్రీశైలం గౌడు కు ఏ పదవి వస్తుందో వేచి చూడాల్సిందే!