calender_icon.png 14 October, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బీఏఎస్’ విద్యార్థుల చదువులకు బ్రేక్

14-10-2025 01:54:58 AM

  1. బిల్లులు విడుదల చేస్తేగానీ అనుమతించని ప్రైవేట్ స్కూళ్లు
  2. న్యాయం చేయాలంటున్న పిల్లల తల్లిదండ్రులు

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ స్కీమ్(బీఏఎస్) స్కూళ్లలో చదివే విద్యార్థుల చదువులు సంది గ్ధంలో పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేస్తే గానీ విద్యార్థులను పాఠశాలలకు అనుమతించబోమని ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రకటించి కూడా రెండు వారాలు కావొస్తోంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనలేదు.

దీంతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ కింద ఉన్న 237 స్కూళ్లకు మూడేళ్లకు రూ.250 కోట్ల వరకు పెండింగ్ నిధులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులను బడుల్లోకి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రానివ్వడంలేదు. దీంతో పలు జిల్లాల్లో తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లెక్కి ఆందోళన చేపడుతున్నారు.

అయితే జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ల జోక్యంతో పలు స్కూళ్లు విద్యార్థులను పాఠశాలలకు రాణిస్తుంటే మరికొన్ని చోట్ల పెండింగ్ నిధులు విడుదల చేసేంత వరకూ పాఠశాలలకు అనుమతించబోమని, తమ సమస్యను తల్లిదండ్రులు, ప్రభుత్వం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా ఈ స్కీమ్ కింద నడిచే కొన్ని పాఠశాలల్లో 40 శాతంపైగానే విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. ఇలా భారీగా విద్యార్థులున్న పాఠశాలలు మాత్రం నిధులు విడుదల చేసేంత వరకూ పాఠశాలల అనుమతికి నిరాకరిస్తున్నారు. తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూళ్లు మాత్రం జిల్లా కలెక్టర్ల హామీతో అనుమతిస్తున్నాయి.