14-10-2025 01:54:35 AM
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? లేక మజ్లిస్ పోటీ చేస్తుందా? లేక మజ్లిస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తున్నాడా? అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నేడు లేదా రేపు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. పార్లమెంటరీ బోర్డు నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టత ఇచ్చారు.
బీజేపీ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి పలువురు నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఖమ్మం నుంచి డాక్టర్ కాసాని మారుతి గౌడ్, లండన్ నుంచి ఎన్నారై శశితోపాటు వారి అనుచరులు, దేవరకొండ, నాగర్ కర్నూల్ నుంచి కూడా పలువురు నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ పార్టీలో చేరేందుకు అనేక మంది మేధావులు, విద్యావంతులు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ వచ్చిన తర్వాత, నేరుగా ఎంఐఎం అధినేత దగ్గరకు వెళ్లి కాళ్లమీద పడి ఆశీర్వాదం తీసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎంఐఎంకి చెందిన వారేనని, ఆయా పార్టీల మధ్య బంధం స్పష్టంగా కనపడుతోందని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఎంఐఎం బీఆర్‌ఎస్‌తో కూడా కాపురం చేసిందని, ఎంఐఎం మద్దతుతోనే గతంలో సిటీలో బీఆర్‌ఎస్ కొన్ని సీట్లలో గెలిచిందన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని చెప్పి, విషాదనగరంగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలిచాక వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని చెప్పి... ఆరు గ్యారంటీలు, 420 వాగ్ధానాలు చేశారన్నారు.
దేశ వ్యాప్తంగా, ఇటు తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం స్పష్టంగా కనపడుతోందని, దాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలని ఆయన కోరారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లలో బీజేపీ గెలిపించి ఆదరించినట్లుగానే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా తమ పార్టీని గెలిపించాలని కోరారు. రేపు అసలైన ప్రతిపక్షంగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆగ డాలను నిలదీసి, వాటిని అడ్డుకుంటామని ఆయన చెప్పారు.
బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ప్రజలకు లాభం లేదని, ఎందుకంటే ఆ పార్టీలోని నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతారనేది తెలియదన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ రాజకీయ చైతన్యంతో ఆలోచించి, బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, ఎస్టీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు రవి నాయక్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, పార్టీ కోశాధికారి దేవకి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.
గెలుపు గుర్రం కోసం బీజేపీ వెతుకులాట!
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించడంలో బీజేపీ వెనుకబడింది. ఒకవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్ర కటించేసి ప్రచారం కూడా చేసేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం అభ్యర్థిని ఇంత వరకూ ప్రకటించనేలేదు.
ఇంకా వడపోత చేపడుతోంది. పైగా రాష్ట్ర నాయకత్వం అభ్యర్థి ఎంపికకు సం బంధించి ఓ ఆరుగురి పేర్లతో జాబితాను జాతీయ నాయకత్వానికి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పంపించారు. అయితే వాటిని పరిశీలించిన జాతీయ నాయకత్వం...మరికొన్ని పేర్లను పంపాలని సూచించినట్లు సమాచారం. ఈక్రమంలోనే గెలుపు గుర్రం కోసం బీజేపీ వెతుకులాట చేపట్టింది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ధీటుగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. ఈక్రమంలో ఎవరైనా వస్తారా? అని వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే బీజేపీలో ఉన్న నాయకుల పేర్లను పరిశీలిస్తుంది.
ఓ మాజీమంత్రి కుమారుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. ఈయన పేరును కూడా బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ నాయకత్వం సూచనతో మరికొంత మంది పేర్లతో జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.