14-10-2025 01:27:44 AM
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్‌లో విమనాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలం అనుకూలమైనది కాదని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నియమించిన కన్సల్టెన్సీ సంస్థ తేల్చిచెప్పింది. సర్కార్ దీంతో ప్రత్యామ్నాయంగా అంత ర్గాం ప్రాంతాన్ని ఎంపిక చేసింది. త్వర లో మళ్లీ కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేయనున్నది.
రాష్ట్రంలోని ఆరు చోట్ల విమనాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం గతంలో ఏఏఐకి ప్రతిపాదనలు పంపించింది. ఆయా ప్రాంతాల్లో ‘టెక్నో, ఎకనామిక్ ప్రీ- ఫిజిబిలిటీ’పై అధ్యయనం చేయాలని కోరింది. ఏఏఐ ఆ బాధ్యతలను ఓ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఆరు ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. దీనిలో భాగంగానే బసంత్‌నగర్‌లో ప్రభుత్వ ప్రతిపాదించిన స్థలం విమనాశ్రయ నిర్మాణానికి అనుకూలం కాదని అనేక టెస్టులు చేసి తేల్చిచెప్పింది.
దీంతో రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాన్ని అన్వేషించి అంతర్గాంను ఎంపిక చేసింది. కలెక్టర్ గ్రామంలోని 591.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించగా, సర్కార్ ఆ స్థలాన్ని ఏఏఐకి ప్రతిపాదించింది. టెక్నో, ఎకనామిక్ ప్రీ- ఫిజిబిలిటీపై అధ్యయనానికి సోమవారం ఆర్‌అండ్‌బీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్ రూ.40.53 లక్షల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మళ్లీ కన్సల్టెన్సీ రంగంలోకి దిగి అంతర్గాంలో అధ్యయనం చేపట్టనున్నది.v