calender_icon.png 14 October, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు

14-10-2025 01:33:30 AM

విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందికి వర్తింపు

  1. వైద్య కళాశాలలతో హాస్టళ్ల అనుసంధానం
  2. విద్యార్థులకు వైద్య పరీక్షలు
  3. వైద్య సేవలు, తనిఖీలకు ప్రత్యేక యాప్‌లు
  4. సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
  5. అత్యవసర ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 60 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రాష్ర్టంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపునకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థ లపై సోమవారం ఐసీసీసీలో రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా హాస్టళ్లలో అత్యవసర పనులకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.60 కోట్లు కేటాయించారు.

ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు , తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇత ర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెసులుబాటు కలి గించింది. హాస్టళ్లకు కేటాయించిన చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్ ను ఉపయోగించాలని సూచించారు.

పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహా రం అందేలా చర్యలు తీసుకోవాలని, దాంతో వారికి లభించే కేలరీలను తెలుసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, పుస్తకాలు సకాలంలో అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధరించాలని సూచించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని సూచించారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించి, అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సూచించారు.

హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపునకు సంబంధించి నిధుల కేటాయింపునకు ప్రణాళికను రూపొందించి సమర్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి.. సీఎస్ రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లను ఆదేశించారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని సీఎం ఆదేశించారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్‌ను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.

హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని సూచించారు. వీటన్నింటికీ అవసరమైన యాప్‌లను రూపొందించాలని ఆదేశించారు.  సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.