14-10-2025 12:57:28 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 13 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వాలు జారీచేసే జీవోలతో కాకుండా, రాజ్యాం గంలోని 9వ షెడ్యూల్ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత రక్షణ లభిస్తుందన్న ప్రధాన ఎజెండాతో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆవిర్భవించింది. జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, విశారధన్ మహారాజ్, బాల్రాజ్ గౌడ్ నేతృత్వంలో ఈ సమితిని ఏర్పాటు చేశారు.
రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర చేపట్టనున్నట్లు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడబోమని జస్టిస్ ఈశ్వరయ్య హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్లు -ఉద్యమ కార్యాచరణ అనే అంశంపై మేధావులు, న్యాయవాదులు, బీసీ సంఘాల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాజ్యాంగపరమైన రక్షణ కల్పించకుండా కేవలం జీవోలతో రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. చిరంజీవులు మాట్లాడుతూ, ‘దేశంలోని అనేక రాష్ట్రాల్లో జీవోల ద్వారా తెచ్చిన రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేశాయి. 9వ షెడ్యూల్‌లో చేర్చడమే ఏకైక పరిష్కారం అని స్పష్టం చేశారు. మండల్ కమిషన్ నుంచి నేటి వరకు బీజేపీ బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశం జరుగుతుండగానే, ఆర్.కృష్ణ య్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ జేఏసీ కో-చైర్మన్ దాసు సురేష్ అక్కడికి వచ్చారు. ఈ నెల 18న జేఏసీ తలపెట్టిన బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వా దం చోటుచేసుకుంది. అనంతరం దాసు సురేష్ మాట్లాడుతూ, బీసీలు విడిపోతే శత్రువులు బలపడతారు. ఈ విష యం నచ్చజెప్పడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు.
18న జరిగే బంద్‌కు మద్దతు ఇవ్వాలని, ఏవై నా అభిప్రాయభేదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులును కోరానని పేర్కొన్నారు. అలాగే, 24న బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నిర్వహించే నిరసనకు మా జేఏసీ మద్దతు ఇస్తుందన్నారు.
తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాల్రాజ్‌గౌడ్ మాట్లాడుతూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా, రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు రాచాల యుగేందర్ గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్, రాచాల యుగేందర్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నం దేవరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.