14-10-2025 01:36:41 AM
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ధోకా తిన్న తెలంగాణకు జూబ్లీహి ల్స్‌లో మోకా వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నిక కారు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్నదని, కార్యకర్తలు, ప్రజల పట్టుదల, తపన బీఆర్‌ఎస్ విజయానికి నాంది కావాలని పిలుపునిచ్చారు. సోమవారం రహమత్‌నగర్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు చిరు కానుకలు ఇస్తూ మాగంటి గోపీనాథ్ ఆదుకున్నారని, ఆ కుటుంబానికి అండగా ఉన్నామని మాగంటి సునీతాగోపీనాథ్‌ను గెలిపించి ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు. కాంగ్రెస్ పాలనపై, రేవంత్‌రెడ్డిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలని, ప్రతి ఇంటికీ కాంగ్రెస్ బాకీ పడ్డ విషయాలను వివరించాలన్నారు.
2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని, మోస పోయిన అన్నాచెల్లెళ్లు జూబ్లీహిల్స్ వైపే చూ స్తున్నారని స్పష్టం చేశారు. ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామని ఇంతవరకూ అతీగతీ లేదని, అత్తలు, కోడళ్లు, ఆడపిల్లలు, గర్భిణిలు, బాలింతలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తాము నిలదీస్తే దివాళాకోరు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అప్పు కోసం వెళ్తే దొంగలెక్క చూస్తున్నారని అంటున్నారని, అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని చెపుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ ఉన్నప్పుడు నల్లా బిల్లులు రాలేదన్న కాంగ్రెస్.. ఇప్పుడు ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకే ఇంటిలో 43 దొంగ ఓట్లు రాయించారని, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డికి సురుకు తగలాలి: హరీశ్
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామీలిచ్చి 7 వందల రోజులు దాటినా అమలు చేయడం లేదని, అందుకే రేవంత్‌రెడ్డికి జుబ్లీహిల్స్ ఎన్నికల్లో సురుకు తగలాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలుగుతుందని రాష్ర్ట ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
తెలంగాణను కేసీఆర్ ఆదర్శ రాష్ర్టంగా తీర్చిదిద్దితే, రేవంత్‌రెడ్డి అత్యంత అవినీతి రాష్ర్టంగా తయారు చేశారని విమర్శించారు. బిల్డింగ్ పర్మిషన్‌కు స్క్వేర్ ఫీట్ కు రూ.75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12 శాతం కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిందని, ఆరు నెలలుగా బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది జీతాలు చెల్లించడం లేదు, మందులు లేవని విమర్శించారు.