20-09-2025 12:00:00 AM
ఎల్బీనగర్, సెప్టెంబర్ 19 : ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఓ మహిళా చైన్ స్నాచర్ ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలు మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని సహారా ఎస్టేట్ లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి డాక్టర్ నిరంజన్, ఆయన భార్య రమాసుందరి(75) నివసిస్తున్నారు.
ఉదయం నిరంజన్ మార్నింగ్ వాక్ వెళ్ల గా భార్య ఇంట్లోనే ఉంది. ఇదే అదనుగా భావించిన ఒక మహిళా చైన్ స్నాచర్ ఇంట్లోకి చొరబడింది. రామ సుందరి కంట్లో కారం చల్లి, చెయ్యి కొరికి మెడలో ఉన్న ఆరు తులాల బంగారు గొలుసును లాక్కెళ్ళింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు.. కేసు నమోదు చేసి సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాధితురాలిని పరామర్శించిన కార్పొరేటర్
సహారా స్టేట్స్ గేటెడ్ కమ్యూనిటీలోనూ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, వృద్ధురాలి మెడలోంచి బంగారం ఆభరణాలు చోరీ చేయడం బాధాకరమని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి అన్నారు. సహారా స్టేట్స్ బహార్ 3/7లో శుక్రవారం ఉదయం సుమారు 6:30 గంటలకు చోటుచేసుకున్న దొంగతనంపై స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగిస్తుందన్నారు.
73 ఏళ్ల రమాసుందరి ఉదయపు పూజకు సిద్ధమవుతుండగా మహిళా దొంగ మిరపపొడి కళ్లలో చల్లి, అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాధితురాలిని కొరికేసి, మెడలో వున్న 3తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసిందన్నారు. సహారా స్టేట్స్ లోని సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సహారా స్టేట్స్ స్థానిక నివాసులు ఆదినారాయణ రెడ్డి, రాఘవేందర్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.