calender_icon.png 5 May, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్వాస.. హాయిగా!

04-05-2025 12:05:25 AM

ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల మంది, భారతదేశ వ్యాప్తంగా 34.3 లక్షల మంది ఆస్థమాతో సతమతమవుతున్నారు. శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన ఏటా వేలాది మంది పడుతున్నారు. ఈ నెల 6 వ తేదీ ప్రపంచ ఆస్థమా దినోత్సవం సందర్భంగా ఆస్థమాకు సంబంధించిన కీలకమైన అంశాలపై స్పెషల్ స్టోరీ !

ఆస్థమా దీర్ఘకాల సమస్యే కావొచ్చు.. జీవితాంతం వేధించేదే కావొచ్చు. అంతమాత్రాన భయపడాల్సిన పనిలేదు. శాపంగా భావించాల్సిన పనిలేదు. దీనికిప్పుడు మంచి మందులు, ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటే ఆస్థమా చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే మనదేశంలో మందులపై సరైన అవగాహన లేకపోవడం.. జబ్బు మీద అపోహలు, భయాలు నెలకొనడం పెద్ద సమస్యగా పరిణమించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్థమా బాధితులతో పోలిస్తే మనదేశంలో 13శాతం మం ది దీంతో బాధపడుతుండగా.. ఆస్థమా మరణాల్లో 42శాతం మనదగ్గరే సంభవిస్తుండటం గమనార్హం. ఇలాంటి వ్యత్యా సాలను తగ్గించే ఉద్దేశంతోనే ’ఇన్ హేలర్ చికిత్సలు అందరికీ‘ అందుబాటులోకి తీసుకుకావాలి‘ అని వరల్డ్ ఆస్థమా డే నినదిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్థమా ఎందుకు వస్తుంది? ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చు? అనే విషయా లపై అవగాహన తప్పనిసరి. 

ఒక ఆస్థమా వైద్యుడిగా.. పిల్లలకు ఆస్థమా ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో వారిని లోతుగా అధ్యయనం చేస్తా. పిల్లలు ఆస్థమా వల్ల ఎదుర్కొనే అవస్థలను నేను ప్రత్యక్షంగా చూశా. ఆధునిక వైద్యరంగం అభివృద్ధి చెందినప్పటికీ.. సమయానికి ఆస్థమా గుర్తించడం.. చికిత్సలో అప్రమత్తత లోపించడం చూస్తున్నాం. అయితే ఆస్థమాపై సమాజం మొత్తం కలిసి ఈ సమస్యను అర్థం చేసుకుని.. చికిత్స ప్రాధాన్యతను గుర్తించి, ఆస్థమా పెరుగుదలను అడ్డుకోవడం పాత్ర వహించాలి. 

చిన్నారుల మానసిక ఆరోగ్యంపై..

ఆస్థమా పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు. తల్లిదండ్రులు, పిల్లలు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు, బాధలకు గురవుతారు. చిన్నపిల్లల్లో ఆస్థమా ప్రారంభం చెందితే.. అవి వారి జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

తల్లిదండ్రులు తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగడం, అత్యవసర చికిత్సలు తీసుకోవడం, ఆస్థమా తీవ్రత ఎప్పుడు పెరుగుతుందో తెలియక భయంతో జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆధునిక చికిత్సలు ఉన్నప్పటికీ.. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆస్థమా నిర్వహణకు అవసరమైన మార్గాలను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. మనదేశంలో ఆస్థమా చాలావరకు సరైన సమయంలో గుర్తించబడటం లేదు.. సరైన చికిత్సలు అందకపోవడం ఇంకా ప్రధాన సమస్యగా ఉంది. 

పెరుగుతున్న ఆస్థమా కేసులు..

1.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 339 మిలియన్ల మంది ఆస్థమాతో బాధపడుతున్నారు. 

2.మనదేశంలో సుమారు 2- శాతం జనాభా ఆస్థమా బాధితులు ఉన్నారు. 

3.పట్టణ ప్రాంతాల్లో 15 శాతం పిల్లలు ఆస్థమాతో బాధపడుతున్నారు.

4.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాహన కాలుష్యం, ఇండస్ట్రియల్ కాలుష్యం, ఇంటి లోపలి కాలుష్యం (అగరుబత్తీలు, పెర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్స్) వంటి విషయాలు ఆస్థమాకు దారితీస్తున్నాయి. 

5.అధికంగా కాస్మొటిక్స్ ఉపయోగించడం వల్ల కూడా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం.. గట్-లంగ్స్ యాక్సిస్ అనే సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇందులో పేగులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నది. పోషకాహార లోపం, మిత ఆహారం, అధిక యాంటీ బయోటిక్స్ వినియోగం వల్ల పేగు మైక్రోబయోమ్ నాశనమవ్వడం వల్ల శ్వాస మార్గాలలో అలర్జీలు, ఇన్ఫెక్షన్స్ పెరుగుదలకు కారణాలుగా మారుతున్నాయని తెలింది. 

ఇన్‌హేలర్లపై అనుమానాలొద్దు..

-ఇన్‌హేలర్లు సుక్షితం. ఆందోళన, అనుమానాలు వద్దు. ఆస్థమా చాలా తీవ్రంగా ఉంటేనే చివరిదశలోనే ఇన్ హేలర్లు వాడుతారని అనుకోవద్దు. ఇవి ప్రాథమిక చికిత్స సాధనాలని తెలుసుకోవాలి. వీటితో తీసుకునే మందు మోతాదు మైక్రోగ్రాముల్లో ఉంటుంది. నేరుగా శ్వాసమార్గాల్లోకే చేరుకుంటుంది. కాబట్టి పెద్దగా నష్టమేమీ ఉండదు. ఈ మందులకు అలవాటు పడటమనేది ఉండదు.

-ఆస్థమా పిల్లల విషయంలో పెరిగే వయసు కదా.. ఇప్పటి నుంచి ఇన్ హేలర్లు ఎందుకు? అని కొందరు వెనకాడుతుంటారు. స్టిరాయిడ్ల వాడకంతో ఎదుగుదల కుంటుపడుతుందని భయపడుతుంటారు. ఇది తప్పు. ఆస్థమా నియంత్రణలో లేకపోతేనే ఎదుగుదల దెబ్బతింటుంది. 

-ఇన్ హేలర్లు ఖరీదైనవని మరికొందరి అభిప్రాయం. మాత్రలతో పోలిస్తే వీటి ధర ఎక్కవే కావచ్చు. కానీ వీటిని సరిగా వాడకపోవడం వల్ల ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చుతో పదేళ్లకు సరిపడిన ఇన్ హేలర్ మందులు కొనుక్కోవచ్చు. 

-ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా బ్యాగ్ లో ఇన్ హేలర్ తీసుకెళ్లాలి. వీటి వాడకోవడాన్ని నామోషీగా భావించొద్దు. ఇన్ హేలర్ వాడకంలో తప్పులు చేయొద్దు. ఇన్ హేలర్ బటన్ నొక్కుతూనే మందును లోనికి పీల్చుకోవాల్సి ఉంటుంది.   

శ్వాస ఫౌండేషన్ ద్వారా సేవలు..

శ్వాస ఫౌండేషన్ ’గట్ చెక్‘ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. గట్ ఆరోగ్యం ద్వారా ఆస్థమా నివారణకు దారిచూపుతున్నది. ఫైబర్ రిచ్ ఫుడ్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ప్రొబయోటిక్స్, వివిధ పోషకాలు పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు సహాయపడతాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థనున మెరుగుపరచి శ్వాస సంబంధిత అలర్జీలను తగ్గిస్తాయి. 

ఇది అందరి బాధ్యత..

-ప్రభుత్వ ఆరోగ్య పథకాలలో అవసరమైన ఇన్ హేలర్ చికిత్సలను చేర్చాలి.

-ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి ఆస్థమాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 

-వాయు కాలుష్య నియంత్రణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలి.

-ఇన్ హేలర్ పై ఉన్న అపోహలను తొలగించడానికి భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

-పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలలో గట్ మైక్రోబయోమ్ పేగు ఆరోగ్యంపై విద్యను అందించాలి. 

-ఆస్థమా రహిత తరం కోసం..

జాగ్రత్తలు.. 

-బయటే కాదు, ఇంట్లోనూ కాలుష్యం ఉంటుంది. గాలి ధారాళంగా వచ్చిపోయేలా చూసుకోవాలి.

-ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చీపురుతో ఊడవకుండా.. బట్టతో తుడుచుకోవాలి. గోడల మీద తేమ, చెమ్మ లేకుండా చూసుకోవాలి.

-దుప్పట్లు, దిండు కవర్లును వారానికోసారి శుభ్రంగా ఉతుక్కోవాలి. వీటిని వేడి నీటిలో జాడించి, ఎండలో ఆరబెట్టి వాడుకోవాలి.

-వాతావరణం మారే సమయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే మాస్కులు పెట్టుకోవాలి.

-పంటలకు పురుగు మందులు చల్లటం.. బొగ్గు గనుల్లో, రాళ్ల గనుల్లో పనిచేయడం వంటి కొన్ని పనులు కొందరికి ఆస్థమా ప్రేరేపితం కావొచ్చు. ఇలాంటివాళ్లు ముక్కుకు, నోటికి మాస్కు లేదా రుమాలు చుట్టుకోవాలి. ఏసీ పడనివారు ముఖానికి నేరుగా గాలి తగలకుండా, గాలి మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి. 

మార్పు సాధ్యమే.. 

ప్రపంచ ఆస్థమా దినోత్సవం 2025 కేవలం ఒక రోజుకు పరిమితం కాదు.. ఇది ఒక మార్పుకు పిలుపు. సమాజం మొత్తం కలిసి పనిచేస్తే.. ఆస్థమా నియంత్రించబడుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అన్ని వయసుల వారు తమతమ పనులను ఇబ్బందులు లేకుండా చేసుకోగలుగుతారు. మన దైనందిన కృషితో ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చే సమాజాన్ని నిర్మించుకోవాలి.

- డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని శ్వాస పౌండేషన్ ఫౌండర్, శ్వాస హాస్పిటల్ చైర్మన్ , నారాయణగూడ, హైదరాబాద్.