బ్రిటిష్ జనతా పార్టీ!

26-04-2024 01:41:39 AM

నమో అంటే.. నమ్మించి మోసం చేయడం

l బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు

 l అధికారం పోయాక ప్రజల వద్దకు కేసీఆర్

l రాజేంద్రనగర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి 

రాష్ట్రంలో  పదేళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు షెడ్డుకు పంపారు. అధికారం పోయాక కేసీఆర్ బస్సు యాత్ర చేయడం చూస్త్తుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్లు ఉన్నది.

రంగారెడ్డి/సిటీబ్యూరో ఏప్రిల్ 25 (విజయక్రాంతి): బీజేపీ అంటే బ్రిటిస్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని ధ్వజమెత్తారు. అధికారం అడ్డుపెట్టుకొని ఆరెస్సెస్ సిద్ధాంతాలను బీజేపీ దేశంపై రుద్దుతున్నదని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలో వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని హెచ్చరించారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి మద్దతుగా రాజేంద్రనగర్‌లో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. చేవెళ్లలో రంజిత్‌రెడ్డిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు చేవెళ్ల అచ్చొస్తుందని, 2004 లో చేవెళ్ల నుంచే పాదయాత్ర చేసిన దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆజ్యం పోశారని తెలిపారు.

రాష్ట్రంలో  పదేళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు షెడ్డుకు పంపారని, అధికారం పోయాక కేసీఆర్ బస్సు యాత్ర చేయడం చూస్త్తుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్లు ఉన్నదని విమర్శించారు. కేసీఆర్‌కు నాలుగు గంటలు టీవీలో మాట్లాడేందుకు సమయం ఉంటుంది కానీ ప్రజల కష్టనష్టాల గురించి చర్చించేందుకు అసెంబ్లీకి రావటానికే సమయం లేదని చురకలంటించారు. మోసపూరిత హామీలు ప్రకటించి గద్దెనెక్కిన మోదీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏ హామీనీ అమలు చేయలేదని విమర్శించారు.

యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. విదేశాల్లోని భారతీయుల నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి దేశంలో ఉన్న 40 కోట్ల జనధన్ ఖాతాల్లో పది పైసలు కూడా వేయలేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గొంతు కోసేందుకు 400 సీట్లు కావాలంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉ ండాలని హెచ్చరించారు. బీజేపీ ఈస్ట్ ఇండియా కంపెనీని స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన సాగిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో సబ్బండ వర్ణాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. 

మూసీ నదిని ప్రక్షళన చేస్తాం

మూసీ నదిని ప్రక్షాళన చేయడంతో పాటు గండిపేట, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, వికారాబాద్‌ను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం చేవెళ్లకు ఏమీ చేయలేదని, కనీసం ఎంఎంటీస్ రైలును వికారాబాద్, చేవెళ్ల వరకు ఎందుకు పొడిగించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబానికి చరిత్రం ఉంది కానీ ఆయన విధానం, సిద్ధాంతాలు లేని పార్టీల పంచన చేరారని విమర్శించారు.  

కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలి

కంటోన్మెంట్ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తేనే ఇక్కడి ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజల ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. మల్కాజగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్ రెడ్డిని, కాంటోన్మెంట్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేష్‌ను గెలిపించాలని కోరారు. కంటోన్మెంట్‌లో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతం లో కంటోన్మెంట్‌ను అబివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు.

బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ పరిధిలోని రోడ్లను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. కంటోన్మెంట్ పరిధిలో ఇండ్లను పునర్నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదని, కనీసం రిపేర్లు కూడా చేసుకోలేని దుస్థితి ఉన్నదని తెలిపారు. భవిష్యత్తులో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను, పది లక్షల ఆరోగ్యశ్రీ సాయం, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500ల కే వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తులాంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దని కోరారు.