తెలంగాణ గుండెల్లో కేసీఆర్

26-04-2024 01:43:41 AM

భగవంతుడు కేసీఆర్‌ను తెలంగాణ కోసమే పుట్టించాడు

l కేసీఆర్ గుండె చీల్చితే కనిపించేది ప్రజలే 

భువనగిరి ఎన్నికల ర్యాలీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల కోసమే భగవంతుడు కేసీఆర్‌ను పుట్టించాడని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల గుండె చీల్చి చూస్తే కనిపించేది కేసీఆర్ అని, కేసీఆర్ గుండెను చీల్చి చూసినా కనిపించేది తెలంగాణ ప్రజలేనని పేర్కొన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానని తెలిపారు. గురువారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు మద్దతుగా భువనగిరి జిల్లా కేంద్రంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. వినాయక చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ పదేళ్ల పాలన అంతా డొల్ల అని, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంతా ఉత్తదేనని విమర్శించారు. డాలర్‌కు రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి రూ.83కి పడిపోయిందని గుర్తుచేశారు.

ఇదా బీజేపీ వాళ్లు చేసిన దేశ అభివృద్ధి అని ప్రశ్నించారు. ఒకాయన దేవుని పేరుతో ఓట్లు అడుగుతుంటే ఇంకొకాయన దేవుని మీద ఒట్లు వేసి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు ఏం చేశారని, ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ప్రశ్నించారు. భువనగిరి జిల్లాలో యాదాద్రి దేవాలయాన్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేశామని, ఏనాడైనా దేవుని పేరు చెప్పి కేసీఆర్ ఓట్లు అడిగాడా అని ప్రశ్నించారు. ఒకరు బీఆర్‌ఎస్ పార్టీ ఇంకో పార్టీకి బీ టీమ్ అంటున్నారని, భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్‌ను తొలగించటానికి కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని విమర్శించారు. ఒక పార్టీ చైర్మన్, మరో పార్టీ వైస్ చైర్మన్ అయ్యారని, ఈ రెండు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు. బీజేపీకి ఓట్లు వేస్తే మోటర్లకు విద్యుత్తు మీటర్లు పెడ్తారని హెచ్చరించారు. మీ ఓటు మీదే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత మంచిగా ఆలోచించి బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. తెలంగాణలో కులం, మతం లేకుండా సుపరిపాలన చేశానని కేసీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రెండు విడతలుగా రూ.30 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు చెప్పారు.

తెలంగాణకు కాంగ్రెస్సే మొదటి శత్రువు

తెలంగాణ రాష్ట్రానికి మొదటి శత్రువు కాంగ్రెస్సేనని కేసీఆర్  నిందించారు.  గతంలో తెలంగాణను ఆంధ్రలో కలిపి తెలంగాణ ప్రజలను వంచించిందని అన్నారు. కేసీఆర్ గుప్పెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించి మీ అందరి సహకారంతో చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించాడని, సాధించిన తెలంగాణను సంక్షేమ రంగంలో పరుగులు పెట్టిస్తూ రైతులకు సకాలంలో సాగునీరు, 24 గంటల విద్యు త్తు, ప్రాజెక్టుల నిర్మాణం చేసి సుపరిపాలన అందించామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని, రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదని, రైతు బీమా అమలుచేయడం లేదని, వడ్లు కొనడం లేదని, రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు.

డిసెంబర్ 19న రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్ల తో కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని  ప్రజలకు సూచించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ సరిగా ఇవ్వకపోవడంతో 225 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. గురుకులాల్లో కల్తీ అన్నం తిని విద్యార్థులు చనిపోతున్నారని, భువనగిరి గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. బాలికలకు స్కూటీ ఇస్తామని లూటీ చేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైందని, మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారని, జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలుచేయలేదని, కరెంట్ సరిగా ఇవ్వని దద్దమ్మలు కాంగ్రెస్ పాలకులు అని ఆగ్రహం వక్తంచేశారు.

అందరం కలిసి యుద్దం చేద్దాం

సమైక్యాంధ్ర పాలనను పారద్రోలి ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సాధించిన మనం 9 సంవత్సరాల కాలంలో అన్నీ సరిగానే చేశామని, కానీ సుడిగాలి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిం ద కేసీఆర్ అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదనిఆరోపించారు. సమైక్య వాదుల నుంచి తెలంగాణ విముక్తి కోసం తెలంగాణవాదులు, విద్యార్థులు చేసిన ఉద్యమం ఉప్పెన అయ్యిందని గుర్తుచేశారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో ప్రాజెక్టులు కడితే ప్రజలు తమను ఓడించా రని, గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటామని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే భూమి, ఆకాశం ఏకం చేసి పోరాటం చేస్తామని, అందుకు మీరందరూ తోడవ్వాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధిక స్థానాలు సాధిం చి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు. క్యామ మల్లేశ్ నీతి, నిజాయితీ కలవాడని, అనుభవమున్న వ్యక్తి అని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల వ్యక్తి అని, ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే 24 గంటలు ప్రజల కోసమే పనిచేస్తారని తెలిపారు.