calender_icon.png 1 November, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, బీజేపీలది ఫెవికాల్ బంధం

01-11-2025 12:54:28 AM

-తెరవెనుక దోస్తీ, పగలు కుస్తీ

-8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించింది కారు పార్టీయే

-పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టిన వారికి సానుభూతి అడిగే హక్కు లేదు

-జూబ్లీహిల్స్ ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, -బీజేపీలది ఫెవికాల్ బంధం అని, తెరవెనుక దోస్తీ చేస్తూ పగలు కుస్తీ పడుతారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం సాయంత్రం వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు.

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తెరవెనుక ఒక్కటేనని, వారిది విడదీయరాని ’ఫెవికాల్’ బంధమని సంచలన ఆరోపించారు. సానుభూతి రాజకీయా లు చేస్తున్న బీఆర్‌ఎస్‌కు ఆ నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పార్టీ తనను తాను బలిదానం చేసుకుని, కారు గుర్తుకు పడాల్సిన ఓట్లను కమలం గుర్తుకు వేయించి తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు పగలు కుస్తీ పడతాయి, రాత్రి దోస్తీ చేస్తాయి.

వారిది కేవలం నాటకం, వారి మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు. ఈ కుమ్మక్కు రాజకీయాలతోనే బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి జూబ్లీహిల్స్ అభివృద్ధిని, తద్వారా హైదరాబాద్ ప్రగతిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ బిడ్డనని చెప్పుకునే కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్.. కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణకు, జూబ్లీహిల్స్‌కు ఒక్క పైసా అయినా అదనంగా తెచ్చారా? రాష్ట్ర ప్రగతికి ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. ఏమీ చేయనప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు అని నిలదీశారు. వీరి అసమర్థత వల్లే హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. 

నా కుడిభుజంగా నవీన్‌ను పంపండి

ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనకు కుడి భుజంగా నవీన్ గెలుపును కానుకగా ఇవ్వండని కోరారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని, రాబోయే 40 ఏళ్లు సేవకుడిగా నవీన్ యాదవ్ అండగా ఉంటాడని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ది దుష్ట సంప్రదాయం

బీఆర్‌ఎస్ పార్టీ సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నించడాన్ని రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. దివంగత పి జనార్దన్‌రెడ్డిని గుర్తుచేస్తూ.. 2007లో పీజేఆర్ అకాల మరణం చెందిన తర్వాత జరిగిన ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాలని కాంగ్రెస్ పార్టీ కోరిందని చెప్పారు. కానీ, ఆనాడు బీఆర్‌ఎస్ రాజకీయాలకు అతీతంగా నిలబడకుండా పీజేఆర్ కుటుంబ సభ్యుడైన విష్ణువర్ధన్‌రెడ్డిపై అభ్యర్థిని నిలబెట్టి పోటీ చేసి దుష్ట సాంప్రదా యానికి తెరలేపిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులకు ఈనాడు సానుభూతి ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది అని నిలదీశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ ప్రజలు సానుభూతిని కాదని, అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్‌ను గెలిపించారని గుర్తుచేశారు.