21-05-2025 08:43:11 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): రైతులు సమగ్ర సమీకృత వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. బుధవారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో మహిళా రైతు అర్షియా బేగం నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ క్షేత్రంలో ఐకెపి, నరేగా నిధులతో రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కొరమీను చేపల కుంటను, అలాగే చేపల ఆహారంగా ఉపయోగించే అజోల్ల పాండ్, పశువుల పాకలు, కూరగాయల తోటలను కలెక్టర్ పరిశీలించారు. చిన్న స్థలంలో చేపల పెంపకం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని తెలిపారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో సంవత్సరానికి నాలుగు లక్షల వరకు ఆదాయం రావచ్చన్నారు.
అజోల్ల, సేంద్రీయ విధానాలతో చేపల పెంపకం, కూరగాయల సాగు చేస్తున్న రైతును కలెక్టర్ అభినందించారు. ఆసక్తి ఉన్న ఇతర రైతులు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని ఎక్కువ మంది రైతులు ఈ విధానాలను అనుసరించాలన్నారు. స్వయం సహాయ సంఘాలు కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు దిశగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా పోర్టేబుల్ భూసార పరీక్ష యంత్రం పనితీరును అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ యంత్రాల ద్వారా భూసార పరీక్షలు త్వరగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతాయని తెలిపారు. ఈ క్షేత్ర సందర్శనలో ఆర్డీవో కోమల్‌రెడ్డి, డీఆర్‌డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో శివకుమార్, ఇతర అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.