calender_icon.png 22 May, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హులకు షెటర్స్ కేటాయింపుపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించాలి

21-05-2025 08:19:30 PM

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ డిమాండ్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లో అనర్హులకు కేటాయించడంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod), జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) స్పందించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తుల సుదర్శన్ డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. షాపింగ్ షెటర్లను అధికారులు అనర్హులకు కేటాయించడం అన్యాయమన్నారు. మార్కెట్ లో కూరగాయల వ్యాపారం చేయని వారికి మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లో షాపింగ్ షెటర్స్ కేటాయించారని ఆరోపించారు.

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత  సోదరీ మణి గంధం సౌజన్య, మాజీ కౌన్సిలర్ లు కొమ్ముల సురేష్ భార్య కొమ్ముల మౌనిక, రాములు నాయక్ కొడుకు శివరామ్ నాయక్, బంధువు అజ్మీర దేవీబాయి, మహిళా కాంగ్రెస్ నేత పోచంపల్లి యశోదలకు షేటర్స్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎంతో మంది అర్హులైన వారు ఉన్నప్పటికీ వారినీ కాదని  రాజకీయ పలుకుబడి గల వారికి కూరగాయల వ్యాపారం చేయని వారికి ఎలా షాపులు కేటాయించారో ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. షాపింగ్ షెటర్స్ కేటాయింపులో లక్షల రూపాయలు చేతులుమారాయని అవినీతి అక్రమాలు జరిగాయన్నారు.

జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఈ విషయంలో వెంటనే స్పంచించి అనర్హులకు కేటాయించిన షాపింగ్ షెటర్ ల నుంచి వారి పేర్లు తొలగించాల ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ కు దాదాపు రూ.7 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఆయన కృషితోనే కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించగా ఆడంబరంగా ప్రారంభించి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. షెటర్ల కేటాయింపులో జరిగిన తప్పులను సవరించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవదిక ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, బీఆర్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ సబ్బని అరుణ్ కుమార్, నాయకులు మద్దెల గోపి, పైడి మల్ల చంద్ర శేఖర్, దాగం చరణ్, ఆడెపు అరుణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.