03-01-2026 12:00:00 AM
పతి, పుత్రులది కేవలం సహకారం
పెత్తనం చెలాయిస్తే చర్యలు
తప్పవంటున్న అధికారులు.
నిర్ణయాధికారం వారిదేనంటూ సూచనలు
మఠంపల్లి, జనవరి 2 : మండలంలోని 29 గ్రామ పంచాయతీలో దాదాపుగా సగం మంది సర్పంచ్ లు మహిళలే ఉన్నారు. అయితే సర్పంచ్ లుగా మహిళలే గెలుపొందిన క్షేత్రస్థాయిలో వారి భర్తలు, పుత్రులదే పెత్తనం కావడం ప్రస్తుతం ఒక సామాజిక సవాల్గా మారింది. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు వారి పెత్తనాలను తగ్గించడంను సీరియస్గా తీసుకున్నాయి. దానిలో భాగంగానే అధికారిక సమావేశాలకు వారికి బదులుగా భర్త, పుత్రులు హాజరైతే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
నిర్ణయాధికారం మహిళలకే..
మహిళలు సర్పంచ్లుగా గెలిచిన గ్రామాల్లో వారి భర్తలే తామే అన్నీ ముందుండి నడిపించాలని చూస్తుంటారు. ఎన్నికల ఖర్చు అంతా భర్తలే భరించడం వల్ల, గెలిచిన తర్వాత అధికారం తమదే అన్న ధీమా వారిలో ఉంటోంది. కానీ అధికారికంగా,ప్రజలు ఎన్నుకున్నది మాత్రం మహిళలనే. కాబట్టి అధికారం కూడా వారి దగ్గరే ఉండాలి. పోలీస్ స్టేషన్లు, మండల ఆఫీసుల చుట్టూ తిరగడం మహిళలకు ఇబ్బందిగా ఉంటుందనే నెపంతో భర్తలు, కుమారులు ఆ బాధ్యతలను తీసుకుంటున్నారు. దీనివల్ల తెలియకుండానే పవర్ వారి చేతుల్లోకి వెళ్తోంది.
కానీ ప్రస్తుతం రోజులు మారి పోయాయి. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించి పురుషులు అన్ని అధికారాలను వారికే వదిలేయడం ఉత్తమం. ప్రజలు కూడా సర్పంచ్ను కాకుండా ఆమె భర్తను సంప్రదిస్తే ఈ పతి సంస్కృతి ఇలాగే కొనసాగుతుంది. అందువల్ల ప్రజల్లో కూడా కొంతమార్పు రావాలి. మహిళా సర్పంచ్ ఉన్నచోట చెక్ పవర్ కూడా మహిళలకే ఉంటుంది కావున భర్తలు, పుత్రులు కేవలం సహాయకులుగా ఉండి, నిర్ణయాధికారం మహిళలకే వదిలేసినప్పుడే అసలైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
మహిళలకే పూర్తి అధికారాలు..
మహిళా సర్పంచ్ ఉన్న గ్రామ పంచాయతీలో వారి స్థానంలో భర్త గాని, కొడుకులు గ్రామ సభలో, ప్రభుత్వ పధకాల పంపిణీ కార్యక్రమాలో పాల్గొన్నరాదు. అలా పాల్గొన్నచో ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. మహిళా సాధికారత సాధించడంలో తప్పక మా వంతు కృషి ఉంటుంది.
- జగదీష్ మఠంపల్లి మండల అభివృద్ధి అధికారి