calender_icon.png 2 January, 2026 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికిస్తే మాకూ అవకాశమివ్వాలి

02-01-2026 01:43:55 AM

  1. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కేటీఆర్

నదీ జలాలపై అవగాహన లేని సీఎం మాకు ఉపన్యాసాలు ఇస్తారా?

రాష్ట్ర హక్కులను ఎలా ధారాదత్తం చేశారో చెప్పబోతున్నారా అని నిలదీత

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు కూడా అదే అవకాశం కల్పించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌చేశారు. తెలంగాణ భవన్ గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సభలో అడుగుపెట్టిన తర్వాత ముఖ్య మంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయని స్పష్టంచేశారు. తాము అడిగింది చాలా సింపుల్ అని, మీరు మీ వెర్షన్ చెప్పండి, మేము మా వెర్షన్ చెబుతామన్నారు.

తాము ప్రధాన ప్రతిపక్షంగా పదేళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో 2016 మార్చి 31న కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ దాన్ని బాయ్‌కాట్ చేసి, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు.

అప్పుడు తప్పు అన్న కాంగ్రెస్ పార్టీకి, ఈ రోజు అదే పద్ధతి సరైనదిగా ఎలా మారిందని ప్రశ్నించారు. ఈ అంశంపై స్పీకర్‌కు లేఖ కూడా ఇచ్చామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని తెలిపారు. నదీ జలాలపై, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి తమకు శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారని విమర్శించారు.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు భాక్రా నంగల్ ప్రాజెక్టును తెలంగాణలో ఉన్నట్టు సీఎం చెప్పారని, అసలు ఆ ప్రాజెక్ట్ హిమాచల్‌ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవాచేశారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ నదీ బేసిన్‌లో ఉందో కూడా తెలియని సీఎంతో గోదావరి, కృష్ణా జలాలపై చర్చ చేయాలా? అని ప్రశ్నించారు. 

మీ దగ్గర ఏం నేర్చుకోవాలి...

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాగునీటి రంగంలో చోటుచేసుకున్న వైఫల్యాలను కేటీఆర్ వివరించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు మరణించిన ఘటనలో ఇప్పటివరకు వారి మృతదేహాలను కూడా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తిగా కూలిపోయినా, ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేని దుస్థితి ఉందన్నారు.

ఆ ఘటనకు బాధ్యులైన ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్లిస్ట్ చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ సిఫార్సు చేసినప్పటికీ, ఆ సంస్థపై చర్యలు తీసుకోలేని స్థాయిలో ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ నిలిచిపోయిన ప్రభుత్వం ఇది అని ఆరోపించారు. తాము వీరి దగ్గర ఏం నేర్చుకోవాలి? చెక్‌డ్యాములు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా?

వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచారో చూపిస్తారా? కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కేఆర్‌ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్‌లో చూపిస్తారా? అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు అందించిందా? ఒక్క చెరువును బాగు చేసిందా? ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా? అని నిలదీశారు.