22-07-2025 12:00:00 AM
కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలి
అశ్వారావుపేటలో బస్‌డిపో ఏర్పాటు చేయాలి
సీపీఐ జిల్లా 3 వ మహా సభలు జయప్రదం చేయండి
సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా
అశ్వారావుపేట, జూలై 21(విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఏర్పడిన బి ఆర్ ఎస్, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాల వల్ల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒరిగింది ఏమి లేదని భద్రాద్రి కొత్తగూడెం సి పి ఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా విమర్శించారు. సోమవారం అశ్వారావుపేట లోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గు బావులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా తరలించే నీటిని మొదటి ప్రాధాన్యత జిల్లాకు ఇవ్వాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, ఆపరేషన్ కాగర్ ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం అన్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల పోడు భూములు సాగు చేస్తూ ఉంటే రెండు లక్షల ఎకరాలకు మాత్రమే పోడు పట్టాలు ఇచ్చారని, మరో లక్ష ఎకరాలకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అశ్వారావుపేటలో హార్టి కల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని, అశ్వారావుపేట లో మినీ బస్ డిపో ఏర్పాటు చేయాలని, పెటలో రెవిన్యూ సబ్ డివిజన్ ఏర్పాటు, నియోజక కేంద్రం లో అన్ని శాఖల డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండలం లోని మధ్య తరహా ప్రాజెక్ట్ అయిన పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడి ఏడాది దాటిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల స్థాయిలో చర్చలు జరిపి త్వరగా గండ్లు పూడ్చి ఆయకట్టు రైతులకు నిరందించాలని సాబిర్ పాషా డిమాండ్ చేశారు.
జిల్లాలోని సమస్యలపై అశ్వారావుపేట లో జరిగే సి పి ఐ జిల్లా 3వ మహాసభలో చర్చించటం జరుగుతుందన్నారు. మహాసభ ప్రాంగణానికి సయ్యద్ మియాజని ప్రాంగణం అని నామకరణం చేశామన్నారు. జూలై 26 వ తేదీ జరిగే మహాసభకు సి పి ఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ ముఖ్య అతిధి గా హాజరవుతారని తెలిపారు. సి పి ఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు.
జిల్లా మహా సభలకు సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనం నేని సాంబశివరావు ముఖ్య అతిధి గా పాల్గొంటారని తెలిపారు. వారితో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు నెల్లకుంట సత్యం, బాగం హేమంతరావు, బి అయోధ్య, ఎం డి మౌలానా, దండి సురేష్, ఏఐటియుసి అధ్యక్షకార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య,రాజకుమార్ హాజరవుతారని తెలిపారు.700. మంది డెలిగెట్స్ మహాసభ కు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశం లో సయ్యద్ సలీం, నర్రాటి ప్రసాద్, గన్నిన రామకృష్ణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.