10 July, 2026 | 3:07 AM

యువకుడి దారుణ హత్య

10-07-2026 02:00 AM

మల్దకల్, జూలై 9: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయ మహేష్(24) అనే యువకుడు పొలం వద్ద రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించాడు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి మహేష్ పొలం వద్ద నిద్రించేందుకు వెళ్లాడు. గురువారం ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా, మహేష్ రక్తపు మడుగులో మృతి చెంది కనిపించాడు.

గుర్తు తెలియని వ్యక్తులు మహేష్ ను అత్యంత దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న మల్దకల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, హత్య వెనుక ఎవరున్నారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.