28-11-2025 12:00:00 AM
మండల వ్యవసాయ అధికారి డి.శ్రీనివాసరావు
గుమ్మడిదల, నవంబర్ 27 :రైతన్నలు బాగుంటే దేశం బాగుంటుందని, అధికారులు చెప్పిన సూచనలను పాటించక రైతులు లాభాలను కోల్పోతున్నారని గుమ్మడిదల మండల వ్యవసాయ అధికారి డి.శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించి వ్యవసాయంలో ప్రస్తుత కూలీల కొరత ఉండడంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు.
వరి కోతలకు హార్వెస్టర్లను వినియోగిస్తుండడంతో గడ్డి వినియోగం తగ్గిపోతుంది. పశుసంపద ఉన్నవారు గడ్డిని సేకరిస్తుండగా మిగతావారు అలాగే పొలంలో వదిలేస్తున్నారని తెలిపారు. తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలతో పాటు గడ్డిని దహనం చేస్తున్నారు. రైతుల అవగాహన లోపంతో చేస్తున్న ఈ చర్యతో భూమిలోని అవశేషాలు, ఖనిజ లవణాలు నశించి, భూసారానికి ముప్పు పొంచి ఉంటుందని తెలిపారు.
కాల్చడం వల్ల కలిగే నష్టాలు
వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుందని తెలిపారు. ముఖ్యంగా నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం, దిగుబడి తగ్గిపోతుందన్నారు. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయని, పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయన్నారు.
మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోయి పొలాల్లో తిరిగే పాములు ముంగిసలు, ఉడుములు, తొండలు ఇలా అనేక రకాల జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు కల్లాల దగ్గరే ఉంటే ధాన్యం కాలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిఖిత, రైతులు పాల్గొన్నారు.