23-10-2025 01:39:55 AM
స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం
ఎన్నికలు ఎప్పుడనేది 2 వారాల్లో చెప్తామని హైకోర్టుకు ఇటీవల తెలిపిన ప్రభుత్వం
బీసీ కోటాపైనా చర్చ!
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో మంత్రివర్గం స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నవంబర్‌లో మళ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీచేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నది.
స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిగిన నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించగా రెండువారాల్లో చెబుతామని ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ 1 లోగా, ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలపాల్సి ఉంది. అదేవిధంగా గతంలో ఎన్నికల కమిషన్ జారీచేసిన షెడ్యూల్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 9 ప్రకారం అని ఉంది.
ఆతర్వాత జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్ జారీచేయాల్సి ఉంటుంది. కొత్త షెడ్యూల్‌లో, బీసీ రిజర్వేషన్లు పాతపద్ధతి ప్రకారం వెళ్లాల్సివస్తే ఏం చేద్దాం..? అనే అంశాలపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికలకు వెళ్లాల్సివస్తే.. పార్టీ పరంగా 42 శాతం సీట్లను బీసీలకు కేటాయించే అంశాన్ని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ నిర్ణయంతో మిగతా పార్టీలను ఇరకాటంలో పడేయడమే కాకుండా మిగతా పార్టీలు కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించే అవకాశం ఉంది.
ఎన్నికలొచ్చాక బీసీ రిజర్వేషన్ల కోసం సర్వశక్తులు ఒడ్డామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిజర్వేషన్లకు సహకరించలేదని ప్రజల్లోకి తీసుకెళ్లి మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ ఆలోచనచేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లలో బీఆర్‌ఎస్ పార్టీ ఇంప్లీడ్ కాలేదని, బీసీల పట్ల ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని బలంగా వాయిస్‌ను వినిపించే అవకాశం ఉంది.
మొత్తంగా బీసీల రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. నవం బర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికలు సకాలంలో నిర్వహించని పక్షంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతుండటం తో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడే ప్రమా దం ఉందనే వాదన కూడా బలంగా ఉంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఒకరకంగా డోలాయామాన స్థితిలో ఇన్నాళ్లు కొనసాగింది.