calender_icon.png 23 October, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు ఒరికా మరిన్ని పెట్టుబడులు

23-10-2025 01:22:55 AM

  1. మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
  2. సుముఖత వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా దిగ్గజ సంస్థ 

హైదరాబాద్,  అక్టోబర్ 22 (విజయక్రాంతి) : దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

తెలంగాణలో ‘ఒరికా’ ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ‘ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ర్టం అత్యంత అను కూలం. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థాయి మౌలి క సదుపాయాలు, ఎకో సిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు.

ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ, మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని ఆహ్వానించారు. ‘పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, అమలు చేస్తున్న ప్రోత్సాహకర, ప్రగతిశీల విధానాలు అభినందనీయం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్వహి స్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ తదితర రంగాల్లో 600 మంది హై స్కిల్డ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించాం.

రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలంగాణలో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగా ల్లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఒరికా సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ తెలిపారు. ‘ఆస్ బయోటెక్ 2025 ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్’లో కీలకోపన్యాసం చేసేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబును కంపెనీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా తెలంగాణ

అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌లోని ప్రముఖ యూనివర్సిటీ ‘ఆర్‌ఎంఐటీ’తో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్‌వోఐ)ను కుదుర్చుకుందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెడీ టూ వర్క్ ఫోర్స్ తయారీ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుం దన్నారు.

రేపటి జీనోమ్ వ్యాలీకి ఇది ఒక బ్లూ ప్రింట్‌గా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. ఆసియాలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ ‘లైఫ్ సైన్సెస్’ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.. 80 బిలయన్ డాలర్ల విలువ చేసే 2 వేలకు పైగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఇక్కడ ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే ఔషధాల్లో మన వాటా 40 శాతంగా ఉందన్నారు. 

‘ఎలీ లిల్లి’ లాంటి దిగ్గజ ఫార్మా సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ యువతను లైఫ్ సైన్సెస్ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్, ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. కేథరిన్ ఇట్సియోపౌలోస్ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ప్రొ.కేథరిన్ ఇట్సియోపౌలోస్ అన్నారు.

రాష్ట్రంలో ‘ఇంటర్‌నేషనల్ ఎడ్యుకేషనల్ సిటీ’

తెలంగాణలో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ‘ఇంటర్‌నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ విక్టోరియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును మెల్‌బోర్న్‌లో బుధవారం వీఐటీ బోర్డు సభ్యుడు, మాజీ పార్లమెంటేరియన్, ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాని సన్నిహితుడు అలన్ గ్రిఫి న్ ప్రత్యేకంగా కలిశారు.

అంతర్జాతీయ విద్యా, నైపుణ్య కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి అనుకూలతలు, ప్రగతిశీల విధానాలు, డిజిటల్ మౌలిక సదు పాయాలు, తెలంగాణ యువత ప్రతిభ, సమర్థవంతమైన నాయకత్వం తదితర అంశాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వారికి వివరించారు.

అనంతరం ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సిటీ’ ఏర్పాటు ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించారు. విదేశీ వర్సిటీలు, ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రాలు, నైపుణ్యా భివృద్ధి సంస్థలకు గ్లోబల్ హబ్‌గా ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తామని ‘విట్’ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పారు. సమావేశంలో వీఐటీ ప్రతినిధి అర్జున్ సూరపనేని, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.