23-10-2025 01:37:32 AM
ఘట్‌కేసర్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): గోవుల తరలింపునకు అడ్డుపడుతున్నాడని గోరక్షక సభ్యుడిపై గోవులను తరలించే వ్యక్తి అయిన ఓ రౌడీషీటర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. కీసర మండలం రాంపల్లికి చెందిన సోనుసింగ్ గోవుల తరలింపు విషయంలో తరచూ అడ్డుపడుతున్నాడని బహదూర్‌పురాకు చెందిన రౌడీషీటర్ ఇబ్రహీం అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వస్తే మాట్లాడుకుందామని పిలిచినట్లు సమాచారం.
కారులో అక్కడకు వెళ్లిన సోనుసింగ్.. రహదారి పక్కనే కారు నిలిపివేసి కిట్టీ స్టీల్ పరిశ్రమ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాం తానికి వెళ్లాడు. అక్కడకు రాగానే పథకం ప్రకారం ఇబ్రహీం సోనుసింగ్‌పై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఛాతిలో బుల్లెట్ గాయాలతోనే రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చి సోనుసింగ్ కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహు టిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సోనుసింగ్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సోనుసింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. సోనుసింగ్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్ ఆస్పత్రిలో పరామర్శించారు. కాగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఘటన స్థలాన్ని ఆరా తీశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఇబ్రహీంపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చీకోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు.