23-10-2025 02:16:18 AM
బాన్సువాడ అక్టోబర్ 22 (విజయ క్రాంతి): ప్రస్తుత మార్కెట్లో నిలకడగా లేని నిత్యవసర సరుకులు, కూరగాయల ధరలను వింటుంటే... గేయ రచయిత రాసిన ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు ... నాగులో నాగన్న... అనే పాట గుర్తుకు వస్తోంది. పట్టెడు అన్నం పెట్టే రైతన్న కాయ కష్టం చేసి కూరగాయలను పండిస్తుంటే నేటి సమాజంలో వాటి ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. తక్కువ ధరలకు రైతుల వద్ద కూరగాయలను కొనుగోలు చేస్తూ, అధిక ధరలతో వ్యాపారస్తులు అమ్ముతున్నారు.
అటు పండించిన రైతును మోసం చేస్తూ ఇటు అధిక ధరలతో విక్రయించి వినియోగదారులను మోసం చేస్తున్నారు. కూలి నాలి చేసుకుని నిరుపేద సామాన్య కుటుంబాల వారు మండిపోతున్న ధరలను చూసి కొనుగోలు చేసేందుకు జంకె పరిస్థితి ఏర్పడింది. వర్షాల కారణంగా కూరగాయల సాగుపై ప్రభావం పడడంతో మార్కెట్లో వాటి ధరలు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. రోజువారీగా కూరగాయల కోసం వంద రూపాయలు చేత పట్టుకుని మార్కెట్ కి వెళ్తే అన్ని దొరికేవి. కానీ నేటి పరిస్థితుల్లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
కూరగాయల ధరలు పెరిగిపోవడం వల్ల కూలి నాలి చేసుకునే వ్యక్తులు కూరగాయలను కొనే పరిస్థితి లేకుండా పోయింది. కూరగాయల పంటల సాగు తగ్గుముఖం పట్టడంతో పక్క రాష్ట్రాల నుండి హోల్సేల్ వ్యాపారులు కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి తో పాటు ఎగుమతి ఖర్చులు పోను 10 శాతం లాభాన్ని చూసుకొని రిటైల్ వ్యాపారులకు అమ్ము తున్నారు. దిగుమతి చేసుకున్న రిటైల్ వ్యాపారులు వీరు మరో 10 నుండి 20 శాతం లాభాన్ని అర్జిస్తూ వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
గత నాలుగు మాసాల క్రితం కూరగాయల ధరలు చాలా తగ్గినట్టుగా ఉండేవి. కానీ వ్యాపారస్తులు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అమ్మడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు వింటుంటేనే గుండె దడ పుట్టుకొస్తుందని మహిళలు వాపోతున్నారు. వారపు సంతల్లో వ్యాపారస్తులు ఇష్టా రీతిన కూరగాయల నమ్ముతున్నారు.
ప్రస్తుతం ఒక్క రోజుకు సరిపోయే కూరగాయలు కొనాలంటే నే రూ. 200 వెచ్చిస్తేనే ఇంటికి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడింది. కూరగాయల ధరలు పైపైకి ఎగబాకుతుంటే కనీసం పప్పులతోనైనా సరిపెట్టుకుందామన్న వాటి ధరలు సైతం నిలకడగా ఉండడం లేదు. ఏరోజుకారోజు కిరాణా వర్తకం దారులు పప్పుల ధరలను సైతం పెంచేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు.
పప్పుల ధరలు సైతం పైపైకి...
కిరాణా సరుకుల విషయంలో కూడా కందిపప్పు, మినప పప్పు, పెసరపప్పు రూ. కిలో 130 నుండి 150 రూపాయలకు అమ్ముతున్నారు. గతంలో రూ. 90 నుండి100 రూపాయల కిలో అమ్మిన పప్పుల ధరలు ప్రస్తుతం రూ. 130 దాకా అమ్ముడు పోతుంది. అదేవిధంగా నిత్యవసర ధరలు పెరిగిపోవడం వల్ల కూలీ పనులు చేసుకునే వ్యక్తులు వారి వారి కుటుంబ పోష నిమిత్తం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
బతుకులు ఎలా సాగాలి...
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద చిన్న కుటుంబా వారు కోరుకున్న రుచికరమైన భోజనం చేయాలంటే పెరుగుతున్న నిత్యవసర ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరిగితే తమ బతుకులు ఎలా సాగించాలంటూ సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కుటుంబాలకు ప్రస్తుతం రూ.200 ఖర్చు చేస్తే తప్ప నోటి కాడికి ముద్ద చేరడం లేదని వాపోతున్నారు. కూరగాయలు నిత్యోదరుల వ్యాపారులు ఇష్టారీతిన ధరలను పెంచేస్తున్న పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహిస్తున్నారు. బడుగు జీవులు బతికేలా కూరగాయలు సరుకుల ధరలను తగ్గించాలని కోరుతున్నారు.
చిన్న ఉద్యోగస్తులకు చింతలే...
బడుగు జీవికి కుటుంబ పోషణ కోసం చాలీచాలని వేతనంతో వచ్చే ఆర్థిక డబ్బులు ఖర్చు చేయడం కష్టంగా మారింది. పెరుగుతున్న నిత్యవసర ధరలు కూరగాయలు కొందామంటే అప్పట్లో వంద రూపాయలు ఖర్చు చేస్తే ఇంటికి సరిపడేంత వచ్చేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి కొందామన్న 200కు మించి కూరగాయలు ఇంటికి చేరి పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా వంట నూనెకు వాడే ఆయిల్ ధరలు పెరిగిపోయాయి.
దేవునికి దీపం పెట్టేందుకు వాడే పామ్ ఆయిల్ కూడా 140 రూపాయలకు చేరింది. ప్రైవేటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నెలకు వచ్చే పది వేల రూపాయల్లో ఇంటి ఖర్చులు పోను మిగిలింది ఏమాత్రం మిగులే పరిస్థితి లేదు. పెరుగుతున్న నిత్యావసర ధరలు వాటికి అనుగుణంగా వర్షాలు పడడంతో కూరగాయల రే ట్లు రెండింతలు అయ్యాయి. మార్కెట్లో పెరుగుతున్న ధరలపై వాణిజ్య పనుల శాఖ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.