23-10-2025 01:33:45 AM
రిటైర్డ్ ఉద్యోగుల వెతలు
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): విశ్రాంత ఉద్యోగులు (పెన్షనర్లు) తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వ తీరుతో వారు కంట కన్నీరు పెడుతున్నారు. పెన్షనరీ బెనిఫిట్స్ అందక.. వైద్యానికి డబ్బుల్లేక ప్రాణాపాయ స్థితిలో కొందరు కొట్టుమిట్టాడుతుంటే.. మరికొందరేమో బలవన్మరణాలకు పాల్పడు తున్నారు. ఇంట్లో ఎదిగిన బిడ్డ పెళ్లి చేయలేక నరకయాతన పడుతున్నారు.
ఉద్యోగ విరమణ పొందాక జీవిత కాలం దాచుకున్న డబ్బు వస్తుందనుకొని తెలిసిన వాళ్ల నుంచి.. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారు దానికి వడ్డీ, ఈఎంఐలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించి, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టు తిరిగితే పనికావడంలేదు. పైగా ఫైల్ క్లియర్ చేయాలంటే వచ్చే మొత్తంలో 10-- నుంచి 20 శాతం వరకు తమకివ్వాలని అధికారులు అడుగుతున్నారని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం పలుమార్లు సమీక్ష చేసినా వారి పరిస్థితి మార డంలేదు. పదవీ విరమణ పొంది ఏదాదిన్నర అవుతున్నా బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో తనకు రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవడంతో మనోవేదనతో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు ఇంటినుంచి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నాడో ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కే కొండయ్య అనే మరో ఉపాధ్యాయుడు ‘ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ను. ఎప్పుడు చనిపోతానో తెలియదు. ఆరో గ్యం విషమించింది. కడసారైనా తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూసే భాగ్యం కలిగించం’ డని ప్రభుత్వానికి మొరపెట్టుకొని ఇటీవల చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది.
రూ.13 వేల కోట్ల వరకు..
ముప్పు ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ రాక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం వైద్యానికి డబ్బులు అందక అనారోగ్యం పాలవుతున్నారు. కేసీఆర్ పెంచి న ఉద్యోగ విరమణ వయసు వల్ల నిలిచిపోయిన రిటైర్మెంట్లు 2024 మార్చి 31తో ప్రారంభమయ్యాయి.
అప్పటినుంచి రాష్ర్ట వ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు వెయ్యి మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 8,672 మంది రిటైర య్యారు. పదవీ విరమణ పొంది ఏడాదిన్నర అవుతున్నా బెనిఫిట్స్ మాత్రం అందడంలేదు. వీరందరికీ గ్రాట్యూటీ, జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, టీజీఎల్‌ఐ, కమ్యూటేషన్, జీఐఎస్ లాంటి బెనిఫిట్స్ కింద దాదాపు రూ. 10 వేల కోట్ల నుంచి రూ.13 వేల కోట్లు వరకు ప్రభుత్వం విడుదలచేయాల్సి ఉంది.
సాధారణంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగు లు పనిచేసిన కాలంలో జమ చేసుకున్న జీపీఎఫ్‌తో పాటు, ఇతర ప్రయోజనాలు అన్నిం టినీ కలిపి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నెలలు గడుస్తున్నా పెన్షనర్లకు ఆ సొమ్మును ఇవ్వడంలేదు.
ఒక్కో ఉద్యోగికి రూ.80 లక్షలు వరకు..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో ఉద్యోగుల రిటైర్డ్‌మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఆర్థిక భారంతో రిటైర్డ్‌మెం ట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే అప్పట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచింది. దాంతో 2024 మార్చి 31 వరకు ఉద్యోగుల రిటైర్డ్‌మెంట్లే లేవు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యాయి. 2024లోనే 7,995 మంది రిటై రయ్యారు.
ఈ ఏడాది 9,630మంది అవుతా రు, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది, 2028లో 7,213 మంది పద వీ విరమణ చేయనున్నారు. 2024 ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్నవారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు. ఉద్యోగుల క్యాడర్ (స్థాయి)ను బట్టి ఇలా ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.30 లక్షలు, అత్యధికంగా రూ.80 లక్షలు రావల్సి ఉంది.
ఇందులో జీపీఎఫ్ కిం ద ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ. 10 నుంచి రూ.12 లక్షలు, గ్రాట్యూటీ కింద రూ.16 లక్షల వరకు, లీవ్ ఇన్‌క్యాష్‌మెంట్ కింద రూ. 3 నుంచి 5 లక్షలు, కమ్యూటేషన్ కింద రూ.7 లక్షల నుంచి రూ. 15 లక్షలు, టీజీఎల్‌ఐ కింద రూ.5లక్షల వరకు, జీఐఎస్ కింద రూ.20 వేల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉంది. ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వంతో గతంలో జరిపిన చర్చల నేపథ్యంలో.. మెడికల్ రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్ డబ్బులు గత నెలలో కొంత మొత్తంలో మంజూరు చేశారు.
నవంబర్ 10 డెడ్‌లైన్..
పెన్షనర్లు (రిటైరైన ఉద్యోగులు) పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. రిటైరైన పెన్షనర్లకు ఉద్యో గ విరమణ తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుకు సన్నద్ధమవుతున్నారు. బెనిఫిట్స్ అన్నీ విడుదల చేయా లని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోరానున్నారు. ధర్నా చౌక్ వేదికగా నిరసన తెలపాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది.
పెండింగ్‌లోని బిల్లులన్నీ ఒకేసారి విడుదల చేయాలని అల్టిమేటం జారీచేసింది. నవంబర్ 10లోపు పెన్షనరీ బెనిఫిట్స్ జీపీఎఫ్, జీఎల్‌ఐ, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డెడ్‌లైన్ జారీచేసింది. లేకుంటే నవంబర్ 17న పెన్షనర్ల కుటుంబ సభ్యులతో కలిసి 33 సంఘాలతో జేఏసీ భారీ ధర్నాను ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో చేపట్టబోతోంది. ప్రభుత్వానికి నేడో రేపో జేఏసీ నోటీసులను అందించనుంది.
10 నుంచి 20 శాతం కమీషన్లు!
బిల్లులు అందక కొంత మంది ఉద్యోగు లు, హెచ్‌ఎంలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనిపై విచారిస్తున్న హైకోర్టు నాలుగు , ఆరు వారాలు గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సం దర్భాలు బన్నాయి. బెన్‌ఫిట్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలిస్తున్నా, కొందరు అధికారులు చెల్లించ బడంలేదు. విడుదల చేయాలంటే 10 నుంచి 20 శాతం కమీషన్లు అడుగుతున్నట్లు విమర్శలున్నాయి. ఇచ్చేవారి బిల్లులను చకచక క్లియర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కమిషన్లు అడిగేవారు కూడా ఒకనాడు పదవీ విర మణ పొందాల్సిందే కదా.. అని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులతోధర్నా చేస్తాం..
పెన్షనరీ బెనిఫిట్స్ బిల్లులు రూ.13 వేల కోట్లు రావాల్సి ఉంది. నవంబర్ 10 లోగా జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్, జీఎల్‌ఐ బిల్లులు చెల్లించాలి. లేకుంటే నవంబర్ 17న కుటుంబ సభ్యులతో ధర్నా చేపడుతాం. రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో రాక అప్పులు కట్టలేక, పిల్లల పెళ్లిళ్లు, చదువులు ఆగిపోయి అవమానభారంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు వృద్ధాప్యంలో అనేక రకాల రుగ్మతులతో ఆసుపత్రు ల పాలై అసువులు బాసుతున్నారు. వీటన్నింటికి కారణం ప్రభుత్వమే.
కే లక్ష్మయ్య, ప్రభుత్వ పెన్షన్‌దారుల జేఏసీ చైర్మన్
ప్రభుత్వం డబ్బుల్లేవంటోంది
నెలకు రూ. 700 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ఉద్యోగ జేఏసీతో ఇచ్చిన హామీ అమలుకావడంలేదు. తమ దగ్గర డబ్బులు లేవని ప్రభు త్వం చెబుతోంది. పదవీ విరమణ పొందిన పెన్షనర్లు తీవ్ర మనోవేదనలోఉన్నారు. అవసరాలనికి డబ్బులు అందక పిల్లల పెళ్లిలు చేయలేకపోతున్నారు. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నవారు ఈఎంఐలు, వడ్డీలు కట్టలేకపోతున్నారు. విడతల వారీగా నైనా ప్రభుత్వం విడుదల చేయాలి.
గడ్డం అశోక్,
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నేత