23-10-2025 02:16:51 AM
-అభినందించిన స్పెషల్ ఆఫీసర్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి
-కలెక్టర్‌తో కలిసి కొనుగోలు కేంద్రాల పరిశీలన
నిజామాబాద్, అక్టోబర్ 22 : ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం సేకరణ కోసం నిజామాబాద్ జిల్లాలో ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేశారని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ అయిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిణి లక్ష్మి అభినందించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ లతో కలిసి బుధవారం ఆమె ఎడపల్లి మండల కేంద్రంలో ఐ.కె.పీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
కేంద్రా లలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల వివరాలతో కూడిన రికార్డులను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులను పలుకరించి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేసి, ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారని రైతులు తెలుపడం పట్ల స్పెషల్ ఆఫీసర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలో రైతులకు బిల్లుల చెల్లింపుల కోసం ట్యాబ్ ఎంట్రీలు చేస్తుండడం పట్ల కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని అభినందించారు. స్లాట్ బుకింగ్, ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాల గురించి రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రంలో అన్ని సదుపాయాలు ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని, ఏ దశలోనూ రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. 17శాతానికి లోబడి తేమ శాతంతో కూడిన ధాన్యం తెచ్చిన వెంటనే తూకం జరిపించి, వెంటదివెంట నిర్దేశిత మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారని, మిల్లుల నుండి ఎప్పటికప్పుడు ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయిస్తున్నామని తెలిపారు.
కౌలు రైతులు పంట పండించినట్లయితే, నేరుగా వారి ఖాతాలలోనే బిల్లులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని రైతుల ఖాతాలలో డబ్బులు జమ కావడం ప్రారంభం అయ్యిందని, పలు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నందున వాటిని అధిగమించిన మీదట ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. డీఆర్డీఓ సాయగౌడ్, డీ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, డీ.సీ.ఓ శ్రీనివాస్ రావు, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగవ్వ, స్థానిక అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.