23-10-2025 01:12:23 AM
ముషీరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వ కుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, నేషనల్ బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య హెచ్చరించారు. ఈనెల 24న ధర్నా చౌక్‌లో జరగనున్న ‘బీసీ మహా ధర్నా’ సన్నాహక సమావేశం బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌ల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, అసెంబ్లీలో బిల్లులు పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఆ బిల్లుకు అప్పట్లో అన్ని పార్టీలు మద్దతు తెలిపి తర్వాత మాట మార్చాయని మండిపడ్డారు. ‘బీసీలకు న్యాయంచేయాలంటే తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, అదే శాశ్వత పరిష్కారం అన్నారు. బీసీలకు రాజకీయాధికారాన్ని సాధించడమే మా లక్ష్యమని చెప్పారు.
అన్ని పార్టీల నేతలు స్వచ్ఛందంగా మహా ధర్నాలో పాల్గొని తమ వైఖరిని ప్రజల ముందు వెల్లడించాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు మాట్లాడుతూ, 42 శాతం రిజర్వేషన్ల సాధన దశలో రెండు వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి కానీ చట్టబద్ధత పొందాలంటే 9వ షెడ్యూల్లో చేర్చడమే మార్గం అన్నారు. జీవోలు, చట్టాలు కోర్టుల్లో నిలువవని ప్రభుత్వానికి కూడా తెలుసని అన్నారు.
మార్చి 17న అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపినా, ప్రభుత్వం తరువాత, జీవో నెం. 9ని విడుదల చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్లో చేర్చేలా చూడాలని సూచించారు. బీజేపీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10 శాతం ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తోందని, ప్రస్తుతం ఉన్న 4 శాతం మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా.విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ, 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేస్తున్న ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే పది రేట్లు పెద్దది అవుతుందని అన్నారు. ఇటీవల జరిగిన బీసీ బంద్ చీకటిలో యుద్ధం లాంటిదని ఆ యుద్ధంలో అమాయక బీసీలను అగ్రకుల నాయకులు చంపేశారని ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రం రెండూ బీసీల హక్కులను అడ్డుకుంటున్నాయని, వాటిపై ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చించేందుకు ఐక్యంగా పోరాడతామని తెలిపారు.
పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ బీసీలపై నోరు మెదపకపోవడం దారుణం అన్నారు. ఫామ్‌హౌస్‌లో దాక్కుని ఉండకుండా బహిరంగంగా బీసీలకు సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. శాస్త్రీయ బీసీ సంఘాల శకం ప్రారంభమైందని, బీసీ ఉద్యమం ఇక రాజకీయంగా మాత్రమే కాకుండా విద్య, ఉపాధి, కాంట్రాక్టులు, న్యాయ విభాగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు సాగుతుందని మహారాజ్ స్పష్టం చేశారు.
సంప్రదాయ బీసీ సంఘాల శకం ముగిసిందని అన్నారు. ఇప్పుడు శాస్త్రీయ బీసీ సంఘాల శకం ప్రారంభమైందని అన్నారు. మధ్యలో దళారి సంఘాలు పుట్టాయని, వాటిని బహిర్గతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలారాజ్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, సింగం నాగేశ్వర్ గౌడ్, దామోదర్ గౌడ్, డాక్టర్ విజయభాస్కర్, గౌడ్ బైరి శేఖర్, చామకూర రాజు, ఎస్. దుర్గయ్య గౌడ్, రామ్ నరసింహ, రాచాల యుగేందర్ గౌడ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.