నేడు క్యాబినెట్ భేటీ
-విద్యుత్ పాలసీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
-స్థానిక ఎన్నికలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్య క్షతన మంగళవారం క్యాబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిం చి నిర్ణయం తీసుకోకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నందున డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన వారోత్సవాలతోపాటు డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పాలసీ డాక్యుమెంట్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
విద్యుత్ పాలసీలపై కూడా చర్చించనున్నారు. రామగుండంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో తలపెట్టిన ధర్మల్ విద్యుత్ ప్లాంట్ అంచనా వ్యయంతోపాటు 4,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్, 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థల ఏర్పాటుకు ఇటీవలి మంత్రివర్గ భేటీలో ప్రతిపాదనలు ఇచ్చారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామగుండంలో మూతపడిన ప్లాంట్‌ను తొలగించి కొత్తది నిర్మిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ప్లాంట్ల అంచనా వ్యవయాలు, ఇతర అంశాలను మరోసారి పరిశీలించి సవరణలతో మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో విద్యుత్‌శాఖ ప్రవేశపెట్టనుంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్కంలు ఉన్నాయి. అదనంగా మరొకటి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనిపైనా చర్చించనున్నారు. ఇక సోలార్ పవర్ వాడకం పెంచడానికి ప్రభుత్వం తీసుకునే పాలసీపై చర్చించే అవకాశం ఉంది. పంచాయతీలో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చేసిన ప్రయత్నానికి కలిగిన ప్రతిబంధకం, కోర్టు సూచ నల మేరకు 50 శాతం పరిమితితోనే ఎన్నికలు నిర్వహించడానికి గల కారణాలపై చర్చించి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం.






