calender_icon.png 9 September, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నిరసనలకు పిలుపు.. ముందస్తు అరెస్టులు

06-12-2024 09:54:41 AM

అప్రమత్తమైన పోలీసులు

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అరెస్టులపై నిరసనలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలుపుతోంది. బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల నివాసాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఇంటి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. కొండపల్లిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్ పల్లిలో ఎమ్మెల్యే మధవారం కృష్ణారావు, దుండిగల్ మండలంలోని నివాసంలో శంభీపూర్ రాజు, ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్భంధం చేశారు.

మాజీ మంత్రి టి.హరీశ్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా బిఆర్ఎస్ నాయకుల అరెస్టుల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావును పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి దాదాపు ఎనిమిది గంటలపాటు ఉంచారు.  బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఎదుర్కొంటున్న పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించిన హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసు చట్టవిరుద్ధమని హరీశ్‌రావు తెలిపారు.