calender_icon.png 1 September, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణలో కెమెరాల పాత్ర కీలకం

01-09-2025 07:29:59 PM

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్..

మెట్ పల్లి (విజయక్రాంతి): జిల్లా ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి, అలాగే నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను చాలా వరకు కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పి అశోక్ కుమార్(District SP Ashok Kumar) అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సోమవారం మెట్ పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన డెబ్భై సీసీ కెమెరాలను ఎస్పి ప్రారంభం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు అమూల్యమైన సాధనాలు అని ప్రతి వీధి, ప్రతి వాణిజ్య కేంద్రం, ప్రతి ముఖ్య కూడలి సీసీ కెమెరాలు కనిపిస్తే, నేరాలు అరికట్టే అవకాశం పోలీసులకు లభిస్తుందని అన్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరాల గుర్తింపు, నిందితుల అరెస్టు, ట్రాఫిక్ నియంత్రణలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా సిసి కెమెరాలు ఉపయోగ పడుతుందన్నారు.పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటులో పోలీస్ శాఖకు సహకరించి త్వరితగతిన ఏర్పాటుకు కృషి చేసిన స్థానికులను జిల్లా ఎస్పీ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మెట్ పల్లి పరిసర ప్రాంత ప్రజలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు గమనించినప్పుడు వెంటనే వందకు నెంబర్‌కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాములు, మెట్ పల్లి, కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు అనిల్, సురేష్ బాబు, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, అనిల్,రాజు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.