01-09-2025 10:22:21 PM
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
నకిరేకల్ పట్టణ కేంద్రంలో పలు వినాయక మండపాలను సందర్శన
మండప నిర్వాహకులు పోలీస్ సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలి
నకిరేకల్,(విజయక్రాంతి): జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం వరకు పోలీస్ యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందనీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. సోమవారం నకిరేకల్ పట్టణంలో పలు వినాయక మండపాలును ఆయన సందర్శించారు. నిర్వాహకులుకు పలు సూచనలు, సలహాలు ఆయన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, పెట్రో కార్, బ్లూ క్లోట్స్ సిబ్బంది, 24x7 పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందనీ ఆయన తెలిపారు.
మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు విద్యుదీకరణ జాగ్రత్తగా చేపట్టాలని ఆయన సూచించారు. ప్రతి మండపాల వద్ద నిర్వాహకులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. వినాయక విగ్రహాల పేరుతో ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. పలు జాగ్రత్తలపై నిర్వహులకు సూచించారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని ఆయన సూచించారు. నిమజ్జనం వరకు పోలీస్ వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలనీ ఆయన కోరారు. వారి వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, యస్బి సిఐ రాము, నల్లగొండ 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తదితరులున్నారు.