01-09-2025 10:05:48 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు.కలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి గడియారం వరకు భారీ ర్యాలీ నిర్వహించి గడియారం సెంటర్లో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ-కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్‌పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నదని తెలిపారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే అని అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడని నిలదీశారు. దీని వెనుక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకమని వాళ్ళు చేస్తున్న కుట్రనే అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా ఏ ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని తెలిపారు. బెదిరింపులు కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని స్పష్టం చేశారు. నిరసనతో భారీగా వాహనాలు బాగా నిలిచిపోయాయి. దీంతో పోలీస్ అధికారులు, బి ఆర్ ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, లతోపాటు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.