13-12-2025 12:29:02 AM
మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ రోజువారి ఖర్చుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎన్నికల ఖర్చుల నోడల్ అధికారి డిసిఓ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.శ్రీనివాస్, డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్ లతో కలసి తో పెద్ద వంగర లో సమావేశం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని, ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని, వాటికి సంబంధించిన రసీదు కూడా జత చేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చు రూ.5 వేల లోపైతే నేరుగా నగదు ఇవ్వొచ్చని, అంతకు మించితే చెక్కు లేదా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తున 45 రోజుల్లోగా మొత్తం లెక్కలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.
నిబంధనలకు మించి అధికంగా ఖర్చు చేసినా, తప్పుడు లెక్కలు చూపినా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒక పంచాయితీలో అనుమతి తీసుకున్న వాహనంపై మరో పంచాయతీలో తిరిగితే దాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచనల ప్రకారం తనిఖీల నిమిత్తం తెలిపిన తేదీల్లో అభ్యర్థులు విధిగా హాజరు కావాలని తెలిపారు.
ఎంసీఎంసీ కమిటీ ద్వారా అనుమతులు తీసుకుని తీసుకోవాలని ప్రకటనల కు సంబంధించిన వ్యయాలను నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. వేణుమాధవ్ , తాసిల్దార్ వినోద్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.