calender_icon.png 22 October, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బీభత్సం..బాలుడి మృతి

22-10-2025 12:00:00 AM

మణికొండ, అక్టోబర్21, విజయక్రాంతి : అతివేగం ఓ చిన్నారిని పొట్టనబెట్టుకుంది. నార్సింగీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూరీ కాలనీలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. దీపావళి పండుగనాడు జరిగిన ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగీకి చెందిన నవీన్ కుమార్ తన రెండేళ్ల కుమారుడు కుషన్ జోయల్‌తో కలిసి టపాసుల కొనుగోలు కోసం ఖాజాగూడ వెళ్లాడు.

తిరుగు ప్రయాణంలో అల్కాపూరీ కాలనీ వద్దకు రాగానే, వెనుక నుండి అతివేగంతో వచ్చిన ఓ కారు వారు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఆ ధాటికి తండ్రీకొడుకులిద్దరూ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. కారు ఆగకుండా చిన్నారి జోయల్ పై నుండి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నవీన్ కుమార్, జోయల్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఇద్దరినీ స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

మార్గమధ్యలోనే బాలుడు జోయల్ తండ్రి ఒడిలో ప్రాణాలు విడిచాడు.ప్రమాదానికి కారణమైన కారును సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న నార్సింగీ పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పండుగ రోజున గారాలపట్టి కన్నుమూయడంతో తల్లిదండ్రు ల రోదనలు మిన్నంటాయి. నవీన్ కుమార్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.