calender_icon.png 18 July, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారణహోమం!

18-06-2025 12:00:00 AM

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఏ విధంగానూ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. పరస్పర హననానికి ఆ రెండు దేశాలు కంకణం కట్టుకొన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఒక్కసారిగా విరుచుకు పడటంతో మొదలైన యుద్ధం తారస్థాయికి చేరుకున్నది. పరస్పర దాడులతో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

మిస్సైల్స్‌తో విరుచుకు పడి ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు కీలక సైనికాధికారులను హతమార్చడం ద్వారా విజయం సాధించినట్లు ఇజ్రాయెల్ భావిస్తున్నది. అయితే, టెహ్రాన్‌లో ఎంత బీభత్సం జరిగినా ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ చలించిన దాఖలాలు లేవు. ఇరాన్ ప్రతిదాడుల్లో ఇజ్రాయెల్ నగరాల్లో కూడా విధ్వంసం జరిగింది. ఇరు దేశాల్లోనూ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇరాన్ చమురు క్షేత్రాలను, ప్రధానమైన ఆయిల్ రిఫైనరీని తాము ముక్కలు చేశామని ఇజ్రాయెల్ చెప్పుకోగా, ఇజ్రాయెల్‌లోని హైఫా బేలో వున్న అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని తాము ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించుకొంది. ఈ విధ్వంసకాండ ఎలా వున్నా ప్రపంచ ఆర్థిక రంగంపై దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి పోవడంతో పశ్చిమాసియా పరిణామాలపై ప్రపంచ దేశాల్లో కలవరపాటు మొదలైంది.

అమెరికా కాదన్నా, అమెరికా కనుసన్నల్లోనే ఈ యుద్ధం మొదలైందని ఇరాన్ బలంగా నమ్ముతున్నది. అణు ఒప్పందానికి రావాలని, యుద్ధం ఆపాలని ఇరాన్‌పై ఒత్తిడి తెస్తున్న అమెరికా రేపోమాపో ఈ యుద్ధంలో తలదూర్చితే పరిణామాలు ఎలా ఉంటాయి? పరిస్థితులు ఇంకా చేజారి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయ వచ్చునని విశ్లేషకులు చెపుతున్నారు. 

మధ్యప్రాచ్యంలో ఇరాక్‌లో అమెరికా ప్రత్యేక దళాల క్యాంపులు, గల్ఫ్‌లోని సైనిక స్థావరాలు, దౌత్య కార్యాలయాలను ఇరాన్ టార్గెట్ చేయగలదు. హమాస్, హెజ్బుల్లాకు మద్దతునిస్తున్న మిలిటెంట్లు, ఇరాక్ మిలిటెంట్లు అమెరికా స్థావరాలపై ఆయుధాలతో విరుచుకు పడితే ట్రంప్‌కు మరోదారి ఉండదు. అమెరికాను యుద్ధక్షేత్రానికి లాగాలనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చాలా కాలంగా చూస్తున్నారనే భావన వుంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా, ఇరాన్‌లో బంకర్లలో దాచి పెట్టారని భావిస్తున్న అణ్వాయుధాలను నిర్వీర్యం చేయలేదు. ఎందుకంటే, ఆ బంకర్లను ధ్వంసం చేయగల బాంబులు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా అనివార్యంగానైనా తలదూర్చితే పరిస్థితులు మరింత ముదిరే ఆస్కారముంది. కెనడా వేదికగా జరుగుతున్న జీబూt7 దేశాల శిఖరాగ్ర సమావేశం ఇప్పటికే ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది.

ఇరాన్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెల్‌కు తగిన కారణాలున్నాయని పేర్కొంది. కలిసి వచ్చే నాటో దేశాలతో అమెరికా పశ్చిమాసియా యుద్ధక్షేత్రంలో కాలు పెడితే ఇరాన్ ఒంటరవుతుంది. అయినా ప్రతిఘటన ఆపక పోవచ్చు. అప్పుడు చమురు ధరలు మరింతగా పెరుగుతాయి. మొన్నమొన్నటి దాకా ట్రంప్ టారిఫ్‌ల యుద్ధాన్ని చవిచూసిన ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది.

అప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లాభం చేకూరుతుంది. ఇబ్బడి ముబ్బడిగా చమురు ఎగుమతి చేసి రష్యా అప్పుడు కోట్లాది డాలర్లు సంపాదిస్తుంది. ఉక్రెయిన్‌పై మరింత తీవ్రంగా యుద్ధాన్ని కొనసాగించడానికి ఆ సొమ్ము ఉపయోగపడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం చివరికి మిగిల్చేది మారణ హోమమే.