calender_icon.png 18 July, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిబంధకాలను అధిగమించడం ఎలా?

18-06-2025 12:00:00 AM

ఖన్యోరపి యః ప్రభూతసారామ్ 

అదుర్గమార్గామ్, అల్పవ్యయారంభాం ఖనిం 

ఖానయతిసోతి సంధత్తే..

 కౌటిలీయం: (7-)“గనులలో అత్యధికమైన ఖనిజం గల దీ, వెళ్ళడానికి సులువైన మార్గం కలదీ, తక్కువ వ్యయంతో పని చేయడానికి వీలున్నదీ అయిన గనిని తవ్వించేవాడు అధిక లాభం పొందుతాడు” అంటాడు ఆచార్య చాణక్య. జాతి సంపదను పెంచడం, ప్రజలకు ఆహారభద్రతను ఇవ్వడం, విద్య వైద్య ఆరోగ్యం లాంటి మౌలిక సదుపాయాల కల్పన, యువతకు ఉపాధి కల్పించడం వంటివి పాలకుల బాధ్యత. ముఖ్యంగా వ్యవసాయం, వాణిజ్య రంగాలవల్ల ఆర్థిక స్వావలంబనను సాధించడమేకాక దేశం సుభిక్షమై అభ్యుదయ మార్గంలో పయనిస్తుంది. 

“గనులనేవి పరిశ్రమలకు ప్రతీకలు. ముడిసరుకు లభ్యత, ఉత్పత్తులను సరఫరా చేయడానికి అనువైన రవాణా సౌక ర్యాలు, నైపుణ్యం కలిగిన నైపుణ్యం లేని మానవ వనరులు అధికంగా లభించే ప్రదేశంలో పరిశ్రమల స్థాపన ఆర్థికంగా లాభి స్తుంది. అంతేకాక వ్యాపారమూ విస్తరిస్తుంది” అని ఆచార్య చాణక్య  ‘కౌటిలీ యం’లో పలు సందర్భాలలో చెప్పాడు.

పరిశ్రమల స్థాపనవల్ల దేశవిదేశాలలో ఎగుమతి దిగుమతులు జరుగుతాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడం సులువవుతుంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లు వ్యక్తిగతంగా నిర్వహించే వ్యాపారాలు, పరిశ్రమలు, ప్రభుత్వం ఏర్పరచే పరిశ్రమలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉమ్మడి గా నెలకొల్పే పరిశ్రమలు..

ఏవైనా లాభాల ప్రాతిపదికగా మనుగడ సాగిస్తాయి. వాటివల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరు గవుతాయి. వినియోగదారునికి అవసరానికి ఉత్పత్తి అందుతుంది. ప్రభుత్వానికి ప న్నుల రూపంలో ఆదాయమూ సమకూరుతుంది. ప్రజలకు సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన వీలవుతుంది.

సమగ్ర వ్యూహంతో ముందడుగు 

ఎవరైనా ఉత్సాహంతో పరిశ్రమలు నెలకొల్పినా/ వ్యాపారం చేసినా పనిపై సరైన అవగాహన లేకుంటే ప్రయోజనం సిద్ధించదు. ఆర్థికంగా నష్టపోతారు. ఔత్సాహికులు ముందుగా సంబంధిత రంగంలో అవసరమైన విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోవాలి. అనుభవాన్ని పొందాలి. మార్కెట్ పోకడలను అవగాహన చేసుకోవాలి. ఆర్థిక విషయాలను సమర్థతతో నిర్వహించుకోవాలి.

వ్యూహాత్మక ప్రణాళికలు రచించుకోవాలి. నాయకుడు బృం దానికి సరైన సమయంలో అవసరమైన ప్రేరణను ఇవ్వగలగాలి. తనకేం కావాలో ఇతరులకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా చె ప్పడం, ఇతరులు చెప్పేది సరైన కోణంలో అవగాహన చేసుకోవడం, సంస్థలో పెట్టుబడి పెట్టిన వాటాదారులను సమన్వయ పరచగలగడం, వినియోగదారుల అవసరాలను గుర్తించడం, సమస్యలను సమ ర్థవంతంగా పరిష్కరించడం, అనునిత్యం మార్పులకు అనుగుణంగా సన్నద్ధతతో ఉండడం వ్యాపారవేత్త కనీస అర్హత.

వ్యాపారంలో రాణించాలనే తీవ్ర తప న, అభిరుచి, అపజయాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగే పట్టుదల, సృజనాత్మక ఆలోచన, చైతన్యం, సాహ సం, పని సంస్కృతిని గౌరవించే వికాసం, త్వరగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం.. కలిగి ఉండాలి. ఏ ప్రదేశంలోనైనా, వ్యాపారాన్ని నిర్వహించాలనుకునే వారికి ఆ ప్రదేశంలో ఉత్పత్తి డిమాండ్, సరఫరాపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

తమ ఉత్పత్తులను కొనేవారి సామర్థ్యంపై అవగాహన ఉండా లి. ఆ ప్రదేశంలో ఇదివరకే ఎవరైనా అ లాంటి ఉత్పత్తులను అమ్మకం చేస్తున్నారా! వారి నుంచి పోటీని తట్టుకోవడం ఎలాగన్న అంశంపై సమగ్ర వ్యూహం ఉండాలి. ఎదుటి వారి బలాబలాలపై అవగాహన, అవకాశాలను మార్కెట్ చేసుకునే వ్యూ హం తెలిసుండాలి. ఉత్పత్తుల డిజైన్ ప్రణాళికలు, వివరాలపట్ల నిర్దిష్ట అవగాహనతో పాటుగా ఉత్పత్తి ప్రక్రియ, సాంకేతిక విధానాలపై పూర్తి సమాచారం ఉండాలి.

సం బంధిత విషయాలన్నీ క్షుణ్ణంగా తెలియా లి. నాణ్యతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలు ఎక్కువ కాలం మనుగడ సాగించ లేవు. ఆర్థిక అవసరాలపట్ల సరైన అంచనాలు ఉండాలి. అవసరమైన మౌలిక వస తులు, యంత్ర సామాగ్రిని సమకూర్చుకోవడం, ఉత్పత్తి, పంపిణీ, కొత్త మార్కెట్ లోకి వెళ్ళేందుకు కావలసిన ఆర్థిక, మానవ వనరులు, ప్రణాళికలు, వాటిని సమకూర్చుకునే విధానం స్పష్టంగా తెలియాలి. 

నష్ట నివారణ మార్గాలు

ఏ వస్తువైనా నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి చేయడం, తక్కువ ధరకు వినియోగదారునికి అందించినప్పుడే మార్కెట్‌లో స్థిరపడతారు. వ్యర్థాలను నియంత్రించుకోవడం, పొదుపు పాటించడం, కొనుగోలు సామర్థ్యం కలిగిన వినియోగదారులను ఆకర్షించడం, వారిని నిలుపు కోవడం.. లాంటివి వ్యాపారవేత్తకు నిత్యం పరీక్షలే. ప్రభుత్వ ప్రమాణాలను, నియమాలను గౌరవించడం, వినియోగదారుల సంతృప్తికి అనుగుణంగా అందించడం..

వంటివ న్నీ వ్యాపార వేత్త స్థానాన్ని నిర్ణయిస్తాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమీకరించుకోవడం, వారిని నిలుపుకోవడం వ్యాపార వేత్తలకు నిత్యపరీక్షే. వారికి అవసరమైన సాంకేతిక శిక్షణను కాలాంతరాలలో ఇప్పించడం, వారివారి రంగాల లో వారు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలను కల్పించడమూ అవసరమే. ఉద్యో గులు, ఉత్పత్తుల భద్రత పట్ల అప్రమత్తత అవసరం. అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి నష్టాన్ని నివారించుకునే విధానం తెలియాలి. 

పరిశ్రమల స్థాపన, నిర్వహణ నల్లేరుబండిపై నడక కాదు. సమస్యలెన్నో అను క్షణం పలకరిస్తుంటాయి. అర్థిక పరమైన సమస్యలు రావచ్చు. నగదు లభ్యత ఉండ క పోవచ్చు. వడ్డీభారం పెరిగిపోవచ్చు. అనుకున్న సమయానికి వినియోగదారులు డబ్బు చెల్లించక పోవచ్చు..

ఇవన్నీ వ్యాపార విస్తరణకు ప్రతిబంధకాలవుతా యి. అలాగే, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, శిక్షణను పొంది మరొక సంస్థకు మారవ చ్చు. వారి శిక్షణకు వ్యయించిందే కాక కొత్తవారికి ఆ శిక్షణను అందించడానికి సమ యం, డబ్బు అధికంగా వెచ్చించాల్సి వ స్తుంది. నిర్వహణ, ప్రక్రియలలో లోపాలు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు సరిగా లేకపోవడం ఉత్పత్తికి విఘాతం కలిగించవచ్చు. 

అసమర్థ యాజమాన్య నిర్వహణ, పోటీదారుల ఒత్తిడి, ప్రభుత్వ నిర్ణయాలు, మారుతున్న సాంకేతికతను అందుకోలేక పోవడం, సృజనాత్మకత లేని ఉద్యోగులు, నైతికత లేని వాటాదారులు, మాట నిలుపుకోలేని వినియోగదారులు, సరైన సమయానికి, సరైన నాణ్యతతో, సరైన ధరకు, సరైన పరిమాణంలో ముడి సరుకుని అందించలేని సరఫరాదారులు..

ఇలా ప్రతిబంధకాలు ఎన్నో అవరోధాలుగా నిలువవచ్చు. వాటన్నింటినీ ముందుగానే ఊహించి తదనుగుణంగా స్పందించి, వాటిని అధిగమించి తనను తాను నిరూపించుకున్న వారే వ్యాపార రంగంలో నాయకులుగా నిలుస్తారు.