02-01-2026 07:26:28 PM
జిల్లా ఎస్పీ నితికా పంత్
ప్రభుత్వ నిషేధిత ప్రమాదకర చైనా మాంజా అక్రమ విక్రయంపై సీసీఎస్ పోలీసుల దాడి
57 చైనా మాంజా రీల్స్ స్వాధీనం
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం నిషేధించిన ప్రమాదకరమైన చైనా మాంజాను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిపై సీసీఎస్ పోలీస్ బృందం ప్రత్యేక దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దాడుల్లో రెబ్బెన మండలం గొలేటి గ్రామానికి చెందిన ఎర్రం మల్లేష్ తన దుకాణంలో అక్రమంగా చైనా మాంజా రీల్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దాడుల్లో మొత్తం 57 చైనా మాంజా రీల్స్‌ను (అంచనా విలువ రూ.3,000/-) స్వాధీనం చేసుకొని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం రెబ్బెన పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే చైనా మాంజా వినియోగం, విక్రయాలు, నిల్వలపై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు.
చైనా మాంజా విక్రయం, నిల్వ లేదా వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరైనా చైనా మాంజా అక్రమ విక్రయాల గురించి సమాచారం తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ దాడిలో సీసీఎస్ పోలీస్ సిబ్బంది ఎస్‌ఐ రాజు కంధూరి, పీసీలు సంజీవ్, దేవేందర్ పాల్గొన్నారు.