02-01-2026 07:30:52 PM
- కేయువిసి ప్రతాప్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద,రోజువారి వేతన అధ్యాపకుల సమస్యలను తమ పరిధిలో ఉన్న మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ కరుణాకర్ రావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ రాష్ట్రంలో 1976 కాలంలో కేవలం 3 కళాశాలలు మాత్రమే ఉండేవని, వాటిలో వరంగల్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఒకటని గుర్తు చేశారు. శతాబ్దానికి చేరువైన సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కళాశాల ఔన్నత్యాన్ని మరింత పెంపొందించేందుకు అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందిస్తున్న నూతన పాఠ్యప్రణాళిక విధానంలో నైపుణ్యాభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. దీనికి అనుగుణంగా ఆర్ట్స్, సామాజిక శాస్త్రాలు, వాణిజ్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర విభాగాలలో నూతన పాఠ్యప్రణాళికల రూపకల్పన చేపట్టాలని సూచించారు.
ఒప్పంద, రోజువారి వేతన అధ్యాపకుల సమస్యలను తమ పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సౌకర్యాల కల్పనకు తక్షణమే చర్యలు చేపడతామని తెలిపారు. కళాశాల జాతీయ మూల్యాంకన గుర్తింపు సంస్థ (నాక్) గుర్తింపుకు వెళ్లాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా అధ్యాపకులు సమిష్టిగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానం కళాశాలలో అమలులోకి తీసుకొస్తున్నామని, ఇది పార్ట్ టైం ఒప్పంద అధ్యాపకులకు కూడా వర్తిస్తుందని వివరించారు.15 రోజులలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య రామచంద్రం మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా కార్యనిర్వాహక మండలి అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సాధ్యమైనంతవరకు అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ... కళాశాలలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంచి గుర్తింపు సాధించవచ్చని అన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళాశాలలో పనిచేయడం మనందరికీ గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కనకయ్య, డాక్టర్ శ్రీధర్ కుమార్ లోతు, డాక్టర్ పుల్ల రమేష్, డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ జూల సత్యం, డాక్టర్ రమాదేవి తదితరులు పాల్గొని పార్ట్ టైం, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి, రిజిస్టర్ ఆచార్య రామచంద్రం లను ఘనంగా సత్కరించారు.