19-08-2025 07:47:53 PM
గురుకులాల పట్ల నిర్లక్ష్యం వీడాలి
మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చెయ్యాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గల మైనారిటీ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది ఔట్ సోర్సింగ్, టీచింగ్-నాన్ టీచింగ్, నాన్ సాంక్షన్ ఉద్యోగులకు నేటి వరకు ప్రభుత్వం వేతనాలు చెల్లించని కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు.
చాలీ చాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు సక్రమంగా చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి ప్రతీ నెల మొదటి వారంలో క్రమం తప్పక వేతనాలు చెల్లించాలి అని ప్రభుత్వాన్ని కోరారు.