04-08-2025 12:19:30 AM
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
పటాన్ చెరు, ఆగస్టు 3 : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహా సంపర్క్ అభియాన్ ద్వారా ఇంటింటికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ సీ అంజిరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని ఆర్‌అండ్బీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు.
కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలో 9.7 కోట్ల రైతన్నలకు రూ.20,500 కోట్లను ప్రధాని విడుదల చేశారని చెప్పారు. ఇందులో తెలంగాణలో 30లక్షల 80వేల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో చాలా పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నారని అన్నారు.
ఈ విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా బీజేపీ నాయకులు, కార్యకర్తలు వివరించాలన్నారు. బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మత ప్రాతిపాదికన రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తూ బీజేపీపై బురద చల్లే కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. జనహిత పేరుతో పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.