04-08-2025 09:36:03 PM
మేడిపల్లి: మత్తు సేవిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పోలీసులు విసిబుల్ పోలీస్ లో భాగంగా ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అట్టి వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద 80 గ్రాముల పాపి స్ట్రా పౌడర్ లభించింది. ఆ వ్యక్తిని విచారించగా రాజస్థాన్ కి చెందిన కిషోర్(22) గ్యాస్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నానని, పని భారం ఎక్కువగా ఉండడంతో తాను మత్తుకి బానిసగా మారాను అని, అది సేవించడం వలన నిద్ర బాగా వస్తుందని తెలిపాడు.
ఇటీవల కాలంలో సొంత రాష్ట్రమైన రాజస్థాన్ కు వెళ్లి అక్కడ తెలిసిన వ్యక్తుల ద్వారా కొంత మొత్తం పాపి స్ట్రా పౌడర్ ను ఖరీదు చేసుకొని తిరిగి హైదరాబాదుకు వచ్చానని, అవసరం ఉన్నప్పుడు దాని సేవిస్తూ తాను రిలీఫ్ పొందుతానని తెలిపారు. ఇట్టి వ్యక్తిపై మేడిపల్లి పోలీసులు ఎన్డిపిఎస్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ...మత్తు జీవితాన్ని అంధకారం చేస్తుందని,యువత మత్తు వదిలి తమ జీవితం వైపు దృష్టి పెట్టాలని సూచన చేశారు.