26-09-2025 06:37:10 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 130 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నాగర్జున సాగర్ రోడ్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని, ఆనాటి దేశ్ ముఖ్ లపై తిరుగుబాటు చేసి భూ పోరాటానికి నాంది పలికారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంచార్జి బీసీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు కొండూరు సత్యనారాయణ, రామరాజు, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.