04-09-2025 01:48:26 AM
సాఫీగా యూరియా పంపిణీ ఫలితం ఇచ్చిన ఐడియా
పట్టా పాస్ బుక్ ఆధారంగా యూరియా పంపిణీ
మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): సక్రమంగా యూరియా పంపిణీకి మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అధికారులు పట్టా పాస్ పుస్తకాల క్రమ సంఖ్య ఆధారంగా యూరియా పంపిణీ ‘ఐడియా’తో తొక్కిసలాటకు చెక్ పెట్టారు. ఉమ్మడి కేసముద్రం మండలంలోని రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో పట్టా పాస్ పుస్తకాలు పొందిన 15,361 రైతులకు పట్టా పాస్ పుస్తకాల సీరియల్ నెంబర్ ఆధారంగా గ్రామాల వారీగా యూరియా పంపిణీకి శ్రీకారం చుట్టారు. సొసైటీ పరిధిలోని ఎరువుల విక్రయ కేంద్రాల సమీప గ్రామాలకు అక్కడే యూరియా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టా పాస్ పుస్తకం గ్రామాల వారిగా 1 నుంచి మొదలుపెట్టి ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున యూరియా పంపిణీ చేపట్టారు.
యూరియా ఎరువుల విక్రయ కేంద్రానికి దిగుమతి కాగానే ఆయా పరిధిలోని గ్రామాల రైతులకు సీరియల్ నంబర్ ఆధారంగా సమాచారం ఇచ్చి యూరియా పంపిణీ చేస్తున్నారు. యూరియా కేటాయింపు జరిగిన రైతు తన పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రజలతో ఎరువుల కేంద్రానికి వస్తే, ఆన్లైన్ ద్వారా రైతు వివరాలను సరిచూసుకొని యూరియా పంపిణీ చేస్తున్నారు. దీనితో గతంలో మాదిరిగా యూరియా తీసుకున్న రైతులే మళ్ళీ లైన్లో నిలబడి టోకెన్లు పొంది యూరియా తీసుకునే పరిస్థితి కి తొలగిపోయింది. దీనితో గ్రామంలో ఉన్న ప్రతి రైతుకు యూరియా లభించే విధంగా ఏర్పాటు చేశారు. మంగళ, బుధవారాల్లో ఈ విధానం ద్వారా2,200 బస్తాల యూరియాను నేరుగా రైతులు ఎరువుల విక్రయ కేంద్రానికి వచ్చి వెళుతున్నారు.
గురువారం మరో 30 టన్నుల యూరియా అలాట్మెంట్ జరిగిందని, తదుపరి జాబితాలో మిగిలిపోయిన రైతులకు క్రమసంఖ్య ఆధారంగా యూరియా పంపిణీ చేస్తామని ఏవో వెంకన్న తెలిపారు. దీనితో టోకెన్లు, కూపన్లు, రాస్తారోకో, చెప్పుల లైన్, తోపులాట, తొక్కిసలాట సంఘటనలు పూర్తిగా కేసముద్రంలో తొలిగిపోయాయి. ఎక్కడికక్కడే సొసైటీల ఎరువుల విక్రయ కేంద్రాల వద్దకు నేరుగా రైతులు వచ్చి తమకు కేటాయించిన యూరియా బస్తాలు ఎలాంటి ఒత్తిడి, ఇబ్బంది లేకుండా తీసుకెళుతున్నారు.
కేసముద్రం మండల వ్యాప్తంగా 25వేల ఎకరాల విస్తీర్ణములో వివిధ పంటలు సాగు చేశారని, ఒక్కో ఎకరానికి, రెండు బస్తాల యూరియా అవసర ఉంటుందని, ఇప్పటివరకు 45 వేల బస్తాల యూరియా పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా 15 వేల బస్తాల యూరియా అవసరం ఉంటుందని ఏవో వెంకన్న తెలిపారు. మరో నాలుగు రోజుల్లో దశలవారీగా రైతులందరికీ తమ వ్యవసాయ పంటలకు అవసరమైన యూరియాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారుల ‘ఐడియా’ వల్ల కేసముద్రం మండలంలో యూరియా కేటాయించిన రైతులే యూరియా తీసుకోవడానికి వస్తుండడంతో రద్దీ తగ్గి, రెండు రోజులుగా యూరియా పంపిణీ సాఫీగా సాగుతోంది.
గిట్ల మొదట నుంచి ఇస్తే బాగుండేది..
మొదటినుంచి ఈ తీరుగా యూరియా ఇస్తే లొల్లి ఉండేది కాదు. రైతులను యూరియా కోసం అటు తిప్పి ఇటు తిప్పి.. నాన్న తిప్పలు పెట్టి ఒక్క బస్తా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు లిస్టులో పేరు చూసి వచ్చిన రైతు తెచ్చిన ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకాన్ని సరిచూసుకొని యూరియా ఇస్తున్నారు. ఈ పద్ధతి ఎంతో బాగుంది. తీసుకునోల్లే మళ్లీ యూరియా తీసుకునే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇకముందు కూడా రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల కంపెనీలో ఇదే పద్ధతి అమలు చేస్తే అర్హులైన వారికే అందుతాయి.
- యాక సాబు, రైతు, ఇంటికన్నె