21-09-2025 12:00:00 AM
మణికొండ రెడ్డి ఫౌండేషన్ ఉదారత
30 మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా
మణికొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : ఆర్థిక ఇబ్బందులు వారి చదువుకు అడ్డంకి కాకూడదన్న గొప్ప సంకల్పంతో, ప్రతిభావంతులైన నిరుపేద రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు మణికొండ రెడ్డి ఫౌండేషన్ (M.R.F) బాటలు వేసింది. మణికొండలోని ఫౌండేషన్ కార్యాలయంలో 30 మంది విద్యార్థులకు తొలి విడతగా ఆరున్నర లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచింది.
దాతలు వి. కోటారెడ్డి, డాక్టర్ గురు ఎన్ రెడ్డి అందించిన ఉదారమైన సహకారంతో ఈ కార్యక్రమం రూపుది ద్దుకుంది. మణికొండ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారి ఉన్నత విద్యకు ఆర్థిక చేయూత అందించారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తును కలగంటున్న తల్లిదండ్రుల సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ జరగడం అక్కడున్న వారిని కదిలించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిత్య హోమ్స్ ప్రతినిధి వెంకటరామిరెడ్డి, కాంటినెంటల్ హాస్పిటల్స్ ప్రతినిధి బాల్ రెడ్డి, మణికొండ వాస్తవ్యులు కొండకళ్ళ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులకు విలువైన సూచనలు అందించి వారిలో స్ఫూర్తి నింపారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
తమ పిల్లల చదువులకు అండగా నిలిచిన ఫౌండేషన్కు, దాతలకు విద్యార్థుల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపించింది. ఈ సహాయాన్ని ఎప్పటికీ మరవమని, బాగా చదివి మంచి పేరు తెస్తామని విద్యార్థులు ప్రతినబూనారు. ఫౌండేషన్ నమ్మకాన్ని నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఉపాధ్యాయులను, అధ్యాపకులను ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమ విజయవంతానికి ఫౌండేషన్ సభ్యులు నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీపతి రెడ్డి, రమణ రెడ్డి, కృపాకర్ రెడ్డి, రామిరెడ్డి, బాల్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రామసుబ్బారెడ్డి, కిషన్ రెడ్డి, రాజా రెడ్డి, ప్రభాకరరెడ్డి, సుబ్బారెడ్డి, శరత్ రెడ్డి, సుభాష్ రెడ్డి, అంజి రెడ్డి, గణేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నారాయణరెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు కృషి చేశారు.